గూగుల్, టెస్లాలో లేఆఫ్‌లు.. టెన్షన్‌లో ఉద్యోగులు

by Disha Web Desk 17 |
గూగుల్, టెస్లాలో లేఆఫ్‌లు.. టెన్షన్‌లో ఉద్యోగులు
X

బిజినెస్ బ్యూరో: ఇటీవల టెస్లా కార్ల అమ్మకాలు తగ్గిపోవడంతో ఎలాన్‌మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కంపెనీలో పనిచేస్తున్న సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించారు. ఎలక్ట్రిక్ వెహికల్ మేకర్ సూపర్‌చార్జర్ బిజినెస్ సీనియర్ డైరెక్టర్ రెబెక్కా టినుచీ, కొత్త ఉత్పత్తుల అధిపతి డేనియల్ హో మంగళవారం ఉదయం కంపెనీని వీడారు. దీనికి సంబంధించిన ఈమెయిల్‌లను వారికి పంపారు. వీరితో పాటు వీరికింద పనిచేస్తున్న సూపర్‌చార్జర్ గ్రూప్‌లో ఉన్న దాదాపు 500 మంది ఉద్యోగులను తొలగిస్తానని మస్క్ ఈమెయిల్‌లో పేర్కొన్నట్లు ఒక నివేదిక పేర్కొంది.

ఖర్చు తగ్గింపు సమయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని మెయిల్‌లో మస్క్ రాశారు. నివేదిక ప్రకారం, మాజీ ఎగ్జిక్యూటివ్ రోహన్ పటేల్ నేతృత్వంలోని టెస్లా పబ్లిక్ పాలసీ బృందం కూడా రద్దు చేయబడుతుందని సమాచారం. అమ్మకాలు పడిపోవడం, ఎలక్ట్రిక్ వాహనాల కోసం తీవ్రమవుతున్న పోటీ మధ్య ఈ నెల ప్రారంభంలో, టెస్లా తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 10 శాతం కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించాలని ఆదేశించింది. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను కూడా తొలగించడంతో పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరో దిగ్గజ కంపెనీ గూగుల్ కూడా లేఆఫ్‌లు చేపడుతుంది. ఖర్చు తగ్గింపు చర్యల్లో భాగంగా అమెరికా వెలుపల తక్కువ ఖర్చులో ఉద్యోగులను నియమించుకోడానికి ప్రోగ్రామింగ్ భాష పైథాన్‌ విభాగంపై అమెరికాలో పనిచేస్తున్న బృందాన్ని తొలగించింది. మేనేజర్‌తో సహా మొత్తం టీమ్‌ను తొలగించి విదేశాల్లో రిమోట్ వర్కర్లను నియమించుకోవాలని చూస్తుంది. అమెరికా పైథాన్ బృందంలో 10 కంటే తక్కువ మంది సభ్యులు పనిచేస్తున్నారు. వీరితో పాటు మరో రెండు విభాగాల్లోని ఉద్యోగులను కూడా తొలగించినట్లు సమాచారం.

Next Story

Most Viewed