బాక్సర్ పర్వీన్‌పై వేటు.. ఒలింపిక్స్‌కు దూరం

by Harish |
బాక్సర్ పర్వీన్‌పై వేటు.. ఒలింపిక్స్‌కు దూరం
X

దిశ, స్పోర్ట్స్ : భారత మహిళా బాక్సర్ పర్వీన్ హుడా‌కు భారీ షాక్ తగిలింది. పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయింది. ఆచూకీ తెలపడంలో విఫలమవడంతో ఆమెపై ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఐటీఏ) శుక్రవారం సస్పెన్షన్ వేటు వేసింది. పర్వీన్ ఏప్రిల్ 2022 నుంచి మార్చి 2023 వరకు ఆమె తన ఆచూకీని వెల్లడించలేదు. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(వాడా) రూల్ ప్రకారం.. 12 నెలల కాలంలో మూడు సార్లు ఆచూకీ వైఫల్యానికి పాల్పడటం నిబంధన ఉల్లంఘన కిందికి వస్తుంది. దీంతో ఐటీఏ ఆమెను 14 నెలలపాటు సస్పెండ్ చేసింది.

గతేడాది ఆసియా క్రీడల్లో పర్వీన్ 57 కేజీల కేటగిరీలో ఒలింపిక్ బెర్త్ సాధించింది. సస్పెన్షన్ వేటుతో ఆమె ఒలింపిక్స్‌‌కు దూరమైంది. అయితే, 57 కేజీల కేటగిరీలో భారత్ తిరిగి ఒలింపిక్ కోటాను పొందే అవకాశం ఉంది. వచ్చే వారం బ్యాంకాక్‌లో జరిగే రెండో వరల్డ్ ఒలింపిక్ బాక్సింగ్ క్వాలిఫికేషన్ టోర్నీ‌లో రిజర్వు బాక్సర్లు ఆ విభాగంలో పాల్గొనొచ్చు. యాంటీ డోపింగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ ప్లాట్‌ఫామ్‌పై అవగాహన లేకపోవడం, సాంకేతి పరిజ్ఞాన లోపం వల్లే పర్వీన్ ఆచూకీని తెలపలేకపోయిందదని ఆమె తరపు లాయర్ తెలిపారు. కాగా, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్(50 కేజీలు), లవ్లీనా బోర్గోహైన్(75 కేజీలు), ప్రీతి పవార్(54 కేజీలు) బాక్సింగ్‌లో ఒలింపిక్ బెర్త్‌లు సాధించారు.

Advertisement

Next Story