టెలికాం పరిశ్రమలో 10-12 శాతం పెరగనున్న జీతాలు!

by Harish |
టెలికాం పరిశ్రమలో 10-12 శాతం పెరగనున్న జీతాలు!
X

న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత టెలికాం పరిశ్రమలో ఉద్యోగుల జీతాలు 10-12 శాతం మేర పెరగనున్నాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ఆర్థిక కష్టాల్లో ఉన్న వొడాఫోన్ ఐడియాతో పాటు ఇతర టెలికాం కంపెనీలు, పరికరాల విక్రేతలు మెరుగైన వేతన పెంపును ఇవ్వనున్నాయి. మొబైల్ హ్యాండ్‌సెట్ తయారీ కంపెనీల కంటే వీరికి ఈసారి జీతాలు ఎక్కువ పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

బలహీనమైన డిమాండ్, తగ్గిపోతున్న అమ్మకాల కారణంగా మొబైల్‌ఫోన్ తయారీ కంపెనీల్లో జీతాల పెరుగుదల 8-10 శాతంతో స్థిరంగా ఉంటుందని, దిగ్గజ కంపెనీల్లో కొన్ని 13 శాతం వరకు ఇంక్రిమెంట్ ఇవ్వొచ్చని స్టాఫింగ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు వెల్లడించారు. ప్రధాన రెండు మూడు టెలికాం కంపెనీలు 5జీ నెట్‌వర్క్ సేవల విస్తరణను వేగవంతంగా చేపడుతున్న క్రమంలో టెక్నికల్, సేల్స్ విభాగాల్లో అధిక జీతాల పెంపునకు నిర్ణయం తీసుకోనుండగా, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు 18 శాతం వరకు వేతన పెరుగుదల ఉండనుంది. సేల్స్ విభాగంలోని ఉద్యోగులకు 12 శాతం వరకు ఇంక్రిమెంట్ ఉంటుందని జీనియస్ కన్సల్టెంట్ ఛైర్మన్ ఆర్‌పి యాదవ్ అన్నారు.

పరిశ్రమలోని క్లౌడ్ ఇంజనీరింగ్, ఏఐ, మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, 5జీ సంబంధిత విభాగాల్లోని ఉద్యోగులకు అధిక ఇంక్రిమెంట్ ఉంటుందని టీమ్‌లీజ్ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టాఫింగ్ హెడ్ కార్తిక్ నారాయణ్ చెప్పారు. ఆర్థిక ఒత్తిడిలో ఉన్న వొడాఫోన్ ఐడియా కీలకమైన ఉద్యోగులను కాపాడుకునేందుకు, పరిశ్రమలో నెలకొన్న పోటీని తట్టుకునేందుకు వారి జీతాలను 10 శాతం మేర పెంచే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story