ఉద్యోగులకు టీసీఎస్ ఆఖరి వార్నింగ్

by S Gopi |
ఉద్యోగులకు టీసీఎస్ ఆఖరి వార్నింగ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ ఉద్యోగులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు సంబంధించి కంపెనీ ఇప్పటికే పలుమార్లు ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేసింది. తాజాగా ఉద్యోగులు ఆఫీసుకు రావడానికి మరోసారి గడువు పొడిగించింది. ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి అందరూ ఆఫీసులకు రావాలని, ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగించడం ఉండదని స్పష్టం చేసింది. ఇదే చివరి అవకాశమని, ఒకవేళ ఎవరైనా ఆఫీసులకు రాకపోతే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇప్పటికే ఉద్యోగులందరికీ ఆఖరి గడువు గురించి సమాచారం అందించినట్టు కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్‌జీ సుబ్రమణ్యం ఓ ప్రకటనలో చెప్పారు. ఉద్యోగులను ఆఫీసులకు రప్పించడం వెనుక భద్రతాపరమైన కారణాలు ఉన్నాయని, వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఉద్యోగులతో పాటు సంస్థకు కూడా ఇబ్బందులు ఉన్నాయని ఆయన వివరించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా సైబర్ దాడులను అడ్డుకోలేమన్నారు. ఇటీవల అమెరికాలో ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ సైబర్ సెక్యూరిటీపై దాడి ఘటనను సుబ్రమణ్యం ప్రస్తావించారు. మరో కంపెనీ హెచ్‌సీఎల్ టెక్ సైతం గతేడాది డిసెంబర్‌లో ర్యాన్సమ్‌వేర్ దాడిని ఎదుర్కొన్నట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే టీసీఎస్ వీలైనంత త్వరగా ఉద్యోగులను ఆఫీసులకు రప్పించే ప్రయత్నాలు చేస్తోంది.

Advertisement

Next Story