మార్చి నాటికి టాటా ఐఫోన్ తయారీపై స్పష్టత!

by Harish |   ( Updated:2023-01-21 14:53:12.0  )
మార్చి నాటికి టాటా ఐఫోన్ తయారీపై స్పష్టత!
X

న్యూఢిల్లీ: దేశీయ దిగ్గజ టాటా గ్రూప్ త్వరలో యాపిల్ ఐ-ఫోన్లను భారత్‌లో అసెంబ్లింగ్‌ ప్రక్రియను ప్రారంభించనుంది. ఇప్పటికే దీనికోసం తైవాన్‌ సంస్థ విస్ట్రన్‌ కార్ప్‌తో టాటా గ్రూప్‌ చర్చలు జరుపుతున్నది. ఈ ఒప్పందం ఖరారైతే భారత్‌లో ఐఫోన్ తయారీని చేపట్టిన మొదటి స్వదేశీ సంస్థగా టాటా నిలవనుంది. ప్రస్తుతం ఐఫోన్‌లను భారత్‌, చైనాలలో తైవాన్‌కు చెందిన విస్ట్రన్‌, ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీ కంపెనీలు అసెంబ్లింగ్‌ చేస్తున్నాయి.

టాటా సంస్థ ఐఫోన్‌ల తయారీని చేపడితే దేశీయ తయారీ రంగానికి మరింత ఊతం లభిస్తుంది. ఇతర గ్లోబల్ సంస్థలకు కూడా దేశంలో ప్లాంట్ల ఏర్పాటుకు వీలవుతుంది. అయితే, విస్ట్రన్‌తో చర్చల్లో ఇప్పటివరకు ఇరు సంస్థలు కలిసి జాయింట్ వెంచర్‌గా ఏర్పాటు కావాలని ప్రయత్నించాయి.

తాజాగా టాటా సంస్థ జాయింట్ వెంచర్‌లో ఎక్కువ భాగం వాటాను తీసుకోవడంపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రక్రియ ఈ ఏడాది మార్చి నాటికి పూర్తవుతుందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. టాటా సంస్థ మార్చి 31 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వ్యవహారంపై ఇరు సంస్థలు స్పందించేందుకు నిరాకరించాయి.

ఇదే సమయంలో టాటా గ్రూప్ టాప్ ఎగ్జిక్యూటివ్ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ, దక్షిణాదిలో ఐఫోన్ అసెంబ్లింగ్ ప్లాంట్‌ను టేకోవర్ చేయడం ద్వారా భారత్‌ను ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్‌గా మార్చాలనే లక్ష్యం నెరవేరుతుందన్నారు. ఈ ప్రక్రియ విజయవంతమైతే దేశీయ ఎలక్ట్రానిక్స్‌తో పాటు మైక్రో ఎలక్ట్రానిక్స్ తయారీలో అవకాశాలు పెరుగుతాయని టీసీఎస్ ఆపరేటింగ్ చీఫ్ గణపతి సుబ్రమణ్యం అన్నారు.

ఇవి కూడా చదవండి : తొలిసారిగా అత్యధిక మార్కెట్ వాటాతో ఐఫోన్ అగ్రస్థానం!

Advertisement

Next Story