భారత మార్కెట్లపై కొనసాగుతున్న విదేశీ మదుపర్ల విశ్వాసం!

by Aamani |   ( Updated:2023-05-14 13:05:27.0  )
భారత మార్కెట్లపై కొనసాగుతున్న విదేశీ మదుపర్ల విశ్వాసం!
X

ముంబై: భారత ఈక్విటీ మార్కెట్లపై విదేశీ పెట్టుబడిదారులు మరింత విశ్వాసం పెంచుకుంటున్నారు. అమెరికా ఫెడ్ మరోసారి కీలక వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు తక్కువగా ఉండటం, దేశీయ ఆర్థిక వృద్ధి సానుకూలంగా ఉండటం, త్రైమాసిక ఫలితాల్లో కంపెనీలు రాణించడం వంటి పరిణామాల మధ్య ఈ నెల మొదటి పక్షం రోజుల్లో విదేశీ మదుపర్లు మన మార్కెట్లలో రూ. 23,152 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టారు. దీంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) 2023లో ఇప్పటివరకు రూ. 8,572 కోట్లతో నికర కొనుగోలుదారులుగా మారారని గణాంకాలు తెలిపాయి. అమెరికా ఆర్థిక గణాంకాలు మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఉండటంతో ప్రపంచ మాంద్యం కొనసగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా డాలర్ క్షీణత కొనసాగడంతో రూపాయి పటిష్టమవడం విదేశీ మదుపర్లు దేశీయంగా పెట్టుబడులను కొనసాగించేందుకు కారణమని నిపుణులు అభిప్రాయపడ్డారు. డిపాజిటరీల డేటా ప్రకారం, మే 2-12 మధ్య ఎఫ్‌పీఐలు భారత ఈక్విటీల్లో రూ. 23,152 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. ఇదే సమయంలో ఈ ఏడాది తొలి రెండు నెలల్లో ఎఫ్‌పీఐలు రూ. 34,000 కోట్లకు పైగా నిధులను ఉపసంహరించుకున్నారు. రంగాల వారీగా చూస్తే ఫైనాన్స్‌లో విదేశీ మదుపర్లు అత్యధిక పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత కేపిటల్ గూడ్స్, ఆటో రంగాల్లో అధికంగా షేర్లను కొన్నారు.

Also Read..

పోయిన మొబైల్‌ఫోన్‌లను ట్రాక్ చేసేందుకు కొత్త వ్యవస్థ!

Advertisement

Next Story