మళ్లీ నష్టాల్లోకి జారిన సూచీలు!

by Harish |
మళ్లీ నష్టాల్లోకి జారిన సూచీలు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లకు మళ్లీ నష్టాలు ఎదురయ్యాయి. వరుసగా ఎనిమిది సెషన్లలో నష్టాలు చూసిన తర్వాత బుధవారం పుంజుకున్న సూచీలు మళ్లీ పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం, భారత ఈక్విటీల నుంచి విదేశీ పెట్టుబడిదారులు నిధుల ఉపసంహరణ కొనసాగించడం, దిగ్గజ కంపెనీల షేర్లలో అమ్మకాలు ఊపందుకోవడం వంటి అంశాలు మార్కెట్ల పతనానికి కారణమయ్యాయి.

ముఖ్యంగా అధిక ద్రవ్యోల్బణం మరికొంత కాలం కొనసాగుతుందనే ఆందోళనల మధ్య వడ్డీ రేట్లు ఇంకా పెరుగుతాయనే సూచనలతో అంతర్జాతీయ మార్కెట్లు దెబ్బతిన్నాయి. దీనికితోడు గ్లోబల్ మార్కెట్లలో ముడి చమురు ధరలు స్వల్పంగా పెరగడం సూచీలను ప్రభావితం చేసింది.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 501.73 పాయింట్లు కుదేలై 58,909 వద్ద, నిఫ్టీ 129 పాయింట్లు నష్టపోయి 17,321 వద్ద ముగిశాయి. నిఫ్టీలో రియల్టీ మినహా అన్ని రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్, హెచ్‌సీఎల్ టెక్, ఎల్అండ్‌టీ, అల్ట్రా సిమెంట్ కంపెనీల షేర్లు మాత్రమే లాభాలను దక్కించుకోగా, మిగిలిన అన్ని బలహీనపడ్డాయి.

ముఖ్యంగా మారుతి సుజుకి, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, ఎంఅండ్ఎం, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, కోటక్ బ్యాంక్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.59 వద్ద ఉంది.

మరోవైపు, హిండెన్‌బర్గ్-అదానీ గ్రూప్ వ్యవహారంలో సుప్రీంకోర్టు కమిటీని నియమిస్తూ ఆదేశాలివ్వడంతో అదానీ కంపెనీల షేర్లు పుంజుకున్నాయి. అదానీ విల్మర్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ పవర్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌ షేర్లు 5 శాతం లాభపడి అప్పర్‌ సర్క్యూట్‌ని తాకాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు 2.7 శాతం లాభపడింది.

Advertisement

Next Story