స్వల్ప లాభాలతో సరిపెట్టిన స్టాక్ మార్కెట్లు!

by Harish |   ( Updated:2023-04-10 13:59:46.0  )
స్వల్ప లాభాలతో సరిపెట్టిన స్టాక్ మార్కెట్లు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస ర్యాలీ తర్వాత సోమవారం ట్రేడింగ్‌లో స్వల్ప లాభాలతో సరిపెట్టాయి. ఉదయం మెరుగైన లాభాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత స్థిరంగా కదలాడాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం, వరుస ఐదు రోజుల లాభాలతో గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు ఆసక్తి చూపించడం వంటి పరిణామాలతో తక్కువ లాభాల వద్దే మార్కెట్లు ర్యాలీ చేశాయి. మిడ్-సెషన్ వరకు ఒడిదుడుకులను ఎదుర్కొన్న తర్వాత నుంచి ఫ్లాట్‌గా ట్రేడింగ్ కొనసాగగా, చివర్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా స్వల్ప లాభాలకు పరిమితమయ్యాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 13.54 పాయింట్లు లాభపడి 59,846 వద్ద, నిఫ్టీ 24.90 పాయింట్లు పెరిగి 17,624 వద్ద ముగిశాయి. నిఫ్టీలో రియల్టీ, ఆటో రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా మోటార్స్ అత్యధికంగా 5 శాతానికి పైగా పుంజుకుంది. విప్రో, పవర్‌గ్రిడ్, ఎల్అండ్‌టీ, ఎంఅండ్ఎం, ఎన్‌టీపీసీ, టెక్ మహీంద్రా, టీసీఎస్, టైటాన్ కంపెనీల షేర్లు అధిక లాభాలను సాధించాయి.

బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్, హిందుస్థాన్ యూనిలీవర్, రిలయన్స్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 81.99 వద్ద ఉంది.

Also Read..

త్వరలో రిలయన్స్ ఐస్‌క్రీం.. కొత్త బిజినెస్‌లోకి అంబానీ..!!

Advertisement

Next Story