2022-23 ఆఖరి రోజు 1000 పాయింట్లకు పైగా ఎగసిన సెన్సెక్స్!

by Harish |
2022-23 ఆఖరి రోజు 1000 పాయింట్లకు పైగా ఎగసిన సెన్సెక్స్!
X

ముంబై: భారత ఈక్విటీ మార్కెట్లు కొన్ని వారాల తర్వాత భారీ లాభాలను సాధించాయి. ముఖ్యంగా 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో సూచీల్లో దూకుడు కనిపించింది. వారాంతం కూడా కావడంతో శుక్రవారం ఉదయం నుంచే మార్కెట్లలో ర్యాలీ కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, దేశీయ కీలక కంపెనీల షేర్లలో కొనుగోళ్ల జోరు కారణంగా సెన్సెక్స్ ఇండెక్స్ ఏకంగా 1,000 పాయింట్లకు పైగా ఎగసింది. గ్లోబల్ మార్కెట్లలో బ్యాంకింగ్ సంక్షోభం నీడలు నెమ్మదిగా తొలగిపోతుండటంతో మదుపర్ల సెంటిమెంట్ బలపడింది.

ఇదే సమయంలో విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. ఇక, దేశీయంగా అతిపెద్ద రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ షేర్ ధర ఏకంగా 4 శాతానికి మించి ర్యాలీ చేయడం గమనార్హం. ఈ ఏడాది మేలో జరగబోయే షేర్‌హోల్డర్ల సమావేశంలో సంస్థ తన ఆర్థిక సేవల వ్యాపారాన్ని వేరు చేయవచ్చనే సంకేతాలతో షేర్ ధర దూసుకెళ్లింది. ఇదే సమయంలో కనిష్టాల వద్ద కొనుగోళ్లు ఊపందుకోవడంతో సూచీలు పుంజుకున్నాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,031.43 పాయింట్లు ఎగసి 58,991 వద్ద, నిఫ్టీ 279.05 పాయింట్లు లాభపడి 17,359 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ రంగం 2 శాతానికి పైగా పెరిగింది. మిగిలిన రంగాలు సైతం రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో సన్‌ఫార్మా, ఏషియన్ పెయింట్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీల స్టాక్స్ మాత్రమే నష్టపోయాయి. రిలయన్స్ 4.29 శాతం, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, విప్రో కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.22 వద్ద ఉంది.

Advertisement

Next Story