భారత ఈవీ మార్కెట్లోకి అడుగుపెట్టనున్న స్కోడా ఆటో

by S Gopi |
భారత ఈవీ మార్కెట్లోకి అడుగుపెట్టనున్న స్కోడా ఆటో
X

దిశ, బిజినెస్ బ్యూరో: చెక్ రిపబ్లిక్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో భారత మార్కెట్లో వేగంగా పెరుగుతున్న ఈవీ విభాగంలో అడుగుపెట్టాలని భావిస్తోంది. దీనికోసం దేశీయంగా ఉన్న సంస్థలతో భాగస్వామ్యంతో పాటు అన్ని రకాల అవకాశాలను అన్వేషిస్తున్నట్టు కంపెనీ మేనేజ్‌మెంట్ బోర్డు సభ్యుడు మార్టిన్ జాన్ బుధవారం ప్రకటనలో వెల్లడించారు. ఈ ఏడాదిలోనే కంపెనీ భారత ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) మార్కెట్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం తన పోర్ట్‌ఫోలియోలో ప్రీమియం ఈవీ ఎస్‌యూవీ మోడల్ 'ఎన్యాక్‌'ను పరీక్షిస్తోందని మార్టిన్ తెలిపారు. ఇప్పటివరకు దేశీయ కంపెనీలతో భాగస్వామ్యం గురించి ఇంకా స్పష్టత రానందున దీనికి గురించి వివరాలు అందుబాటులో లేవు. కానీ, భారత ఈవీ మార్కెట్లో వచ్చేందుకు సరైన అవకాశం కోసం చూస్తున్నామని మార్టిన్ వివరించారు. ప్రస్తుతం యూరప్ మార్కెట్లో తాము మొత్తం పోర్ట్‌ఫోలియోలో 10 శాతం ఈవీ కార్లను కలిగి ఉన్నాము. ఈవీ విభాగంపై మరింత దృష్టి సారించి 2030 నాటికి 50 శాతం నుంచి 70 శాతం వరకు, 2035 నాటికి పూర్తిస్థాయిలో ఈవీలను కలిగి ఉండాలనే లక్ష్యంతో ఉన్నట్టు మార్టిన్ జాన్ పేర్కొన్నారు.

Advertisement

Next Story