TAX: పన్ను నోటీసులు సులభంగా అర్థం అయ్యే విధంగా ఉండాలి: సీతారామన్

by Harish |
TAX: పన్ను నోటీసులు సులభంగా అర్థం అయ్యే విధంగా ఉండాలి: సీతారామన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: పన్ను చెల్లింపుదారులకు పంపిస్తున్న నోటీసులను వారికి అర్థం అయ్యే విధంగా సరళ భాషలో ఉండేలా చూడాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయపు పన్ను శాఖకు సూచించారు. బుధవారం 165వ ఆదాయపు పన్ను దినోత్సవ వేడుకలో సీతారామన్ పాల్గొన్నారు, ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, నోటీసులు, సర్క్యులర్‌లలో సాధారణ భాషను ఉపయోగించాలి, దాని ద్వారా పన్ను చెల్లింపుదారులు దానిలో ఉన్న వివరాలను సులువుగా అర్థం చేసుకోగలరు. వారిని భయపెట్టినట్టుగా ఉండే వ్యాఖ్యలు కాకుండా స్నేహపూర్వకంగా ఉండే పదాలను వాడాలని అన్నారు.

పంపిన నోటీసు వెనుక కారణాన్ని స్పష్టంగా, సరళంగా వివరించాలి, ఇలా చేయడం ద్వారా ప్రజలను తమ ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయమని ప్రోత్సహించినట్లవుతుంది, పన్ను అధికారులు వ్యాపారులు, వ్యక్తులను వేధింపులకు గురి చేయకుండా, వారి అధికారాలను న్యాయబద్ధంగా ఉపయోగించాలి, చివరి ప్రయత్నంగా మాత్రమే కఠినంగా వ్యవహరించాలని ఆదాయపు పన్ను శాఖకు సీతారామన్ సూచించారు.

కొత్త సాంకేతికతను ఉపయోగించే విధానంలో సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని ఆమె అన్నారు. పన్ను చెల్లింపుదారుల నుంచి స్వచ్ఛంద చెల్లింపులు చేసేలా ప్రోత్సహిస్తూనే విధి విధానాలను అధికారులు అనుసరించాలని సీతారామన్ చెప్పారు. ఇంకా ఆమె మాట్లాడుతూ, మొదటిసారి పన్ను చెల్లింపుదారుల నుండి 58.57 లక్షల ఐటీఆర్‌లు అందాయి, మొత్తం పన్ను చెల్లింపుదారులలో 72 శాతం మంది కొత్త పన్ను వ్యవస్థలకు మారారు. రెండవ పన్ను విధానం చాలా సులభం, మినహాయింపులతో ఉంటుంది, దీనిలో ఎలాంటి తలనొప్పులు ఉండవు అని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed