Stock Market: తొలిసారి 84,000 దాటిన సెన్సెక్స్

by S Gopi |
Stock Market: తొలిసారి 84,000 దాటిన సెన్సెక్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఈక్విటీ మార్కెట్లలో రికార్డుల ర్యాలీ కొనసాగుతోంది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లు పుంజుకున్నాయి. ఈ ప్రభావం మన మార్కెట్లకు మద్దతిచ్చాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్, నిఫ్టీ రెండూ సరికొత్త గరిష్ఠాలకు చేరాయి. సెన్సెక్స్ తొలిసారి 84,000 మైలురాయిని, నిఫ్టీ 25,750ని దాటాయి. ఫెడ్ ప్రకటన తర్వాత చైనా, జపాన్ లాంటి దేశాల సెంట్రల్ బ్యాంకులు సైతం వడ్డీ రేట్ల విషయంలో స్థిరత్వాన్ని కొనసాగించనున్నట్టు స్పష్టం చేశాయి. అలాగే, ప్రపంచ ఆర్థికవ్యవస్థ బలమైన వృద్ధిని కొనసాగిస్తున్న నేపథ్యంలో భారత వృద్ధి, విదేశీ నిధులు రానున్న రోజుల్లో పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయని విశ్లేషకుల అంచనా. ప్రధానంగా కీలక ఎఫ్ఎంసీజీ సహా ఇతర రంగాల్లో డిమాండ్, ఇన్‌పుట్ ఖర్చుల తగ్గింపు వంటి ప్రయోజనాలతో వృద్ధికి వీలుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా వడ్డీ రేట్ల ప్రభావాన్ని ఎదుర్కొనే రియల్ ఎస్టేట్, బ్యాంకులు, ఆటో రంగాల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఇదే సమయంలో మెటల్ రంగ షేర్లలోనూ ర్యాలీ జరగడంతో ఆల్‌టైమ్ రికార్డులు నమోదయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,359.51 పాయింట్లు ఎగసి 84,544 వద్ద, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకింగ్ రంగం మినహా అన్ని రంగాలు 1 శాతానికి పైగా దూసుకెళ్లాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎంఅండ్ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎల్అండ్‌టీ, భారతీ ఎయిర్‌టెల్, నెస్లె ఇండియా, అదానీ పోర్ట్స్, హిందూస్తాన్ యూనిలీవర్ 2 శాతానికి పైగా లాభపడ్డాయి. ఎస్‌బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.54 వద్ద ఉంది. స్టాక్ మార్కెట్లలో రికార్డుల ర్యాలీ కారణంగా శుక్రవారం మదుపర్లు ఒక్కరోజే రూ. 6 లక్షల కోట్లకు పైగా పెరగ్గా, బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 472 లక్షల కోట్లకు పెరిగింది.

Next Story