941 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

by S Gopi |
941 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాలను సాధించాయి. గత వారం పూర్తిగా ఊగిసలాట ధోరణిలో ర్యాలీ చేసిన సూచీలు సోమవారం ట్రేడింగ్‌ని అద్భుతమైన దూకుడుని ప్రదర్శించాయి. ఉదయం ప్రారంభంలో కొంత స్థిరంగా కనిపించినప్పటికీ ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లు, బ్యాంకింగ్ షేర్లలో కొనుగొళ్ల జోరుతో లాభాలు పుంజుకున్నాయి. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లతో పాటు యూరప్ మార్కెట్లు రాణించాయి. అమెరికా ఫెడ్ నిర్ణయాలకు సంబంధించి ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉండటం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం మన మార్కెట్లలో సెంటిమెంట్‌ను పెంచింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పరిస్థితులు చక్కబడటంతో ముడిచమురు ధరలు దిగొచ్చాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 941.12 పాయింట్లు దూసుకెళ్లి 74,671 వద్ద, నిఫ్టీ 223.45 పాయింట్లు ఎగసి 22,643 వద్ద ముగిశాయి. నిఫ్టీలో బ్యాంకింగ్, మెటల్, ఫార్మా రంగాలు బలపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఆల్ట్రా సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, ఎన్‌టీపీసీ కంపెనీల షేర్లు 2 శాతానికి పైగా పుంజుకున్నాయి. హెచ్‌సీఎల్ టెక్, ఐటీసీ, విప్రో, బజాజ్ ఫిన్‌సర్వ్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.45 వద్ద ఉంది.

Advertisement

Next Story