700 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

by S Gopi |
700 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాలను చూశాయి. ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశంలో కీలక రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నప్పటికీ, ద్రవ్యోల్బణ ఆందోళనలు ఉన్నాయనేలా గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్యలు మదుపర్ల సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. ద్రవ్యోల్బణం లక్ష్య పరిధిలోనే ఉందన్న దాస్, వడ్డీ రేట్లను ఇప్పట్లో తగ్గించే అవకాశం లేదన్నారు. దీనివల్ల ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు పెద్ద ఎత్తున జరిగాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఆటో రంగ షేర్లను ఇన్వెస్టర్లు విక్రయించారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 723.57 పాయింట్లు నష్టపోయి 71,428 వద్ద, నిఫ్టీ 212.55 పాయింట్ల నష్టంతో 21,717 వద్ద ముగిశాయి. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంక్, మీడియా, ఐటీ రంగాలు రాణించాయి. మిగిలిన రంగాలు బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. ఐటీసీ, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లె ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల స్టాక్స్ 2 శాతానికి పైగా నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.99 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed