Stock Market: మళ్లీ నష్టాల్లోకి జారిన సూచీలు

by S Gopi |
Stock Market: మళ్లీ నష్టాల్లోకి జారిన సూచీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మళ్లీ నష్టాలను ఎదుర్కొన్నాయి. అంతకుముందు సెషన్‌లో రికార్డు నష్టాల నుంచి కోలుకుంటున్న సంకేతాలిచ్చిన సూచీలు గురువారం ట్రేడింగ్‌లో తిరిగి బలహీనపడ్డాయి. ప్రధానంగా ఆహార ద్రవ్యోల్బణం అధిక స్థాయిల వద్దే కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశంలో వరుసగా తొమ్మిదవసారి వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. అంచనాలకు అనుగుణంగానే ఆర్‌బీఐ నిర్ణయం ఉండటంతో స్టాక్ మార్కెట్లలో ర్యాలీ పెరగలేదు. దీనికితోడు కీలక ఐటీ, మెటల్ రంగాల షేర్లలో అమ్మకాలు ప్రభావితం చేశాయి. మిడ్-సెషన్ సమయంలో పుంజుకునే ప్రయత్నం చేసినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, భారత ఈక్విటీల నుంచి విదేశీ మదుపర్లు నిధులు వెనక్కి తీసుకోవడం వంటి పరిణామాలు నష్టాలకు కారణమయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 581.79 పాయింట్లు పతనమై 78,886 వద్ద, నిఫ్టీ 180.50 పాయింట్ల నష్టంతో 24,117 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఫార్మా, మీడియా, ఫినాన్స్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, సన్‌ఫార్మా షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. ఏషియన్ పెయింట్, ఇన్ఫోసిస్, పవర్‌గ్రిడ్, ఎల్అండ్‌టీ, ఆల్ట్రా సిమెంట్, హెచ్‌సీఎల్ టెక్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.96 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed