స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న నష్టాలు!

by Vinod kumar |
స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న నష్టాలు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. బుధవారం ట్రేడింగ్‌లోనూ సూచీలు ఉదయం నుంచి ప్రతికూలంగా ప్రారంభమయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలకు తోడు విదేశీ మదుపర్లు భారత ఈక్విటీల నుంచి నిధులను ఉపసంహరించుకోవడం, రూపాయి విలువ బలహీనపడటం వంటి పరిణామాలు మార్కెట్ల పతనానికి కారణంగా నిలిచాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావానికి తోడు దేశీయ కీలక కంపెనీల షేర్లలో అమ్మకాలు గణనీయంగా ఉండటం వంటి అంశాల కారణంగా ఓ దశలో కీలక సెన్సెక్స్ ఇండెక్స్ 600 పాయింట్లకు పైగా దెబ్బతిన్నది.

ఆ తర్వాత కొంత కోలుకున్నప్పటికీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో నష్టాలు తప్పలేదు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 286.06 పాయింట్లు నష్టపోయి 65,226 వద్ద, నిఫ్టీ 92.65 పాయింట్లు కోల్పోయి 19,436 వద్ద ముగిశాయి. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంక్, ఆటో, ఫార్మా, హెల్త్‌కేర్, మెటల్, ఫైనాన్స్ రంగాలు 1 శాతానికి పైగా నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో నెస్లె ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఆల్ట్రా సిమెంట్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.25 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed