మెరుగైన ఉపాధి కోసం నాణ్యమైన చేప పిల్లల పెంపకం

by Sridhar Babu |
మెరుగైన ఉపాధి కోసం నాణ్యమైన చేప పిల్లల పెంపకం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : మత్స్య కార్మిక కుటుంబాల ఉపాధిని మెరుగుపర్చి, వారిని ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు నాణ్యమైన చేప పిల్లల పెంపకంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించామని బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి తెలిపారు. మత్స్య అభివృద్ధి పథకం కింద 2024 - 2025 సంవత్సరానికి గాను వందశాతం సబ్సిడీపై చెరువులు, రిజర్వాయర్లలో చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎడపల్లి మండలం జానకంపేట్ లోని అశోక్ సాగర్ చెరువులో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేప పిల్లలను లాంఛనంగా వదిలారు.

మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యుల సమక్షంలో చేప పిల్లల రకాలను, సైజును, నాణ్యతను పరిశీలించి, బరువును తూకం వేస్తూ, ఒక్కొక్కటిగా వాటి సంఖ్యను క్షుణ్ణంగా లెక్కించిన మీదట చెరువులో వదిలారు. ఈ చెరువులో మొత్తం 57300 చేప పిల్లలు విడుదల చేయగా, అందులో బొచ్చ రకం 22920, రోహు రకం 28650 , బంగారు తీగ జాతికి చెందిన చేప పిల్లలు 5730 ఉన్నాయని ఎమ్మెల్యే వివరించారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 2.27 కోట్ల చేప పిల్లలు చెరువులలో వదులుతున్నట్టు తెలిపారు. నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగానే చేప పిల్లలు కేటాయించారా లేదా అన్నది జాగ్రత్తగా నిర్ధారించుకోవాలని సూచించారు.

ఎక్కడైనా తేడా జరిగితే జిల్లా అధికారుల దృష్టికి తేవాలని కోరారు. రెండు, మూడు విడతలుగా చేప పిల్లలను చెరువుల వద్దకు తరలిస్తూ వాటి నాణ్యత ప్రమాణాలను సంఘాల బాధ్యులు క్షుణ్ణంగా పరిశీలించిన మీదట చెరువులలో విడుదల చేస్తే బాగుంటుందని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న అశోక్ సాగర్ చెరువు చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేయించేందుకు కృషి చేస్తానని, కొన్ని చోట్ల గుర్రపు డెక్కను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, మత్స్యశాఖ జిల్లా అధికారి ఆంజనేయ స్వామి, మత్స్య కార్మిక సంఘాల ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed