వారాంతం అధిక లాభాల్లో ముగిసిన సూచీలు!

by Harish |
వారాంతం అధిక లాభాల్లో ముగిసిన సూచీలు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో లాభాలు కొనసాగాయి. వరుస ఐదు రోజుల తర్వాత గురువారం ట్రేడింగ్‌లో కోలుకున్న సూచీలు వారాంతం అధిక లాభాల్లో దూసుకెళ్లాయి. ఉదయం సానుకూలంగా మొదలైన మార్కెట్లు మిడ్-సెషన్ సమయానికి అమ్మకాల ఒత్తిడి కారణంగా నష్టాల్లోకి మారాయి. ముఖ్యంగా దిగ్గజ కంపెనీల షేర్లలో మదుపర్లు, షేర్లను భారీగా విక్రయించారు. దీనికి తోడు బ్యాంకింగ్ రంగంలో నెలకొన్న సంక్షోభం కారణంగా గ్లోబల్ మార్కెట్లు బలహీనపడటం ప్రభావితం చేశాయి.

అయితే, మధ్యాహ్నం తర్వాత అమెరికాలో సవాళ్లను అధిగమించే దిశగా బ్యాంకులు చర్యలు ప్రారంభించడం, ఐటీ రంగంలో కొనుగోళ్లు జోరు పెరగడంతో సూచీలు తిరిగి లాభాల బాట పట్టాయి. ఇదే సమయంలో గత కొద్దిరోజులుగా కనిష్టాలకు చేరిన కారణంగా ఇన్వెస్టర్లు కొనేందుకు ఆసక్తి చూపించడంతో లాభాలు పెరిగాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 355.06 పాయింట్లు ఎగసి 57,989 వద్ద, నిఫ్టీ 114.45 పాయింట్లు లాభపడి 17,100 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెచ్‌సీఎల్ టెక్, అల్ట్రా సిమెంట్, నెస్లే ఇండియా, టాటా స్టీల్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ కంపెనీల షేర్లు అధిక లాభాలను సాధించాయి.

ఐటీసీ, మారుతీ సుజుకి, ఎన్‌టీపీసీ, ఏషియన్ పెయింట్, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.57 వద్ద ఉంది.

Advertisement

Next Story