SBI: ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ 600 కొత్త బ్రాంచుల ప్రారంభం

by S Gopi |
SBI: ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ 600 కొత్త బ్రాంచుల ప్రారంభం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. దీనికోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కొత్త 600 బ్రాంచులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు బ్యాంకు ఛైర్మన్ సీ ఎస్ శెట్టి చెప్పారు. బుధవారం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. మరింత సమర్థవంతంగా బ్రాంచులను విస్తరించాలని భావిస్తున్నాం. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలపై దృష్టి సారిస్తూ, పెద్ద రెసిడెన్షియల్ ప్రాంతాల్లో ఎక్కువ బ్రాంచులను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు 137 కొత్త బ్రాంచులను ప్రారంభించింది. అందులో 59 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. దీంతో 2024, మార్చి నాటికి దేశవ్యాప్తంగా 22,542 బ్రాంచులను కలిగి ఉంది. వీటితో పాటు 65 వేల ఏటీఎంలు, 85 వేల బిజినెస్ కరస్పాండేట్లు ఉన్నారు. దాదాపు 50 కోట్ల మందికి సేవలందిస్తున్నామని, దేశంలోని ప్రతి ఒక్కరికీ చేరువ కావాలనేది బ్యాంకు అత్యుత్తమ లక్ష్యమని శెట్టి వెల్లడించారు.

Advertisement

Next Story