SBI : రూ.20 వేల కోట్ల లాభాలను సాధించిన SBI

by Harish |   ( Updated:2024-05-09 14:42:33.0  )
SBI : రూ.20 వేల కోట్ల లాభాలను సాధించిన SBI
X

దిశ, బిజినెస్ బ్యూరో: దిగ్గజ ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. మార్చి 31, 2024తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 24 శాతం వృద్ధితో రూ.20,698 కోట్ల లాభాలను ఆర్జించినట్లు ఎస్‌‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది గత ఏడాది ఇదే కాలంలో రూ.16,695 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం రూ.1.06 లక్షల కోట్ల నుంచి రూ.1.28 లక్షల కోట్లకు పెరిగింది. ఈ త్రైమాసికంలో, బ్యాంక్ వడ్డీ ఆదాయాలు ఏడాది ప్రాతిపదికన 19 శాతం పెరిగి రూ.1,11,043 కోట్లకు చేరుకుంది, గత ఏడాది ఇది రూ. 92,951 కోట్లుగా ఉంది.

మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఆస్తుల నాణ్యత మెరుగుపడింది. స్థూల నిరర్థక ఆస్తులు 2.24 శాతానికి తగ్గాయి. సమీక్ష కాలంలో స్థూల అడ్వాన్స్‌లు ఏడాది ప్రాతిపదికన 15 శాతం పెరిగి రూ.37,67,535 కోట్లకు చేరాయి. ముఖ్యంగా, బ్యాంక్ రిటైల్ వ్యక్తిగత రుణాలు 15 శాతం వృద్ధితో రూ.13,52,265 కోట్లకు, గృహ రుణాలు రూ. 7,25,818 కోట్లతో, 13 శాతం వృద్ధి చెందాయి. త్రైమాసికంలో మొత్తం డిపాజిట్లు రూ. 49,16,077 కోట్లుగా ఉన్నాయి. వీటిలో దేశీయ టర్మ్ డిపాజిట్లు రూ.27,82,340 కోట్లు, పొదుపు ఖాతా (కాసా) డిపాజిట్లు రూ.19,41,996 కోట్లుగా నమోదయ్యాయి.

బోర్డు మీటింగ్‌లో ప్రతి షేరుకు 13.70 రూపాయల డివిడెండ్ చెల్లించాలని సిఫార్సు చేశారు. ఎస్‌‌బీఐ చైర్మన్ దినేష్ ఖరా మాట్లాడుతూ, ఈ మార్చి త్రైమాసికంలో బ్యాంకు రుణ వృద్ధి బలంగా ఉంది, ఇది ఎనిమిది త్రైమాసికాల్లో అత్యుత్తమ వృద్ధిని సాధించిందని అన్నారు. అలాగే, ఎఫ్‌వై24లో ప్రస్తుతం ఉన్నటువంటి 15-16 శాతం క్రెడిట్ వృద్ధిని కొనసాగిస్తాం, డిపాజిట్ వృద్ధి 13-14 శాతంగా ఉంటుందని ఖరా చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed