LinkdIn: మరో పదేళ్లలో 9-5 ఉద్యోగాలుండవు: లింక్‌డ్ఇన్ సహ-వ్యవస్థాపకుడు

by S Gopi |
LinkdIn: మరో పదేళ్లలో 9-5 ఉద్యోగాలుండవు: లింక్‌డ్ఇన్ సహ-వ్యవస్థాపకుడు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం అనేక వ్యవహారాలు ఆన్‌లైన్ ద్వారానే జరిగిపోతున్నాయి. కొవిడ్-19 మహమ్మారి తర్వాత ఇది మరింత వేగంగా పెరిగింది. దాదాపు అన్ని రంగాల్లో పని విధానం కూడా టెక్నాలజీపైనే ఆధారపడి కొనసాగుతోంది. ఇటీవలే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పటికే అనేక రంగాల్లో ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. కంపెనీల యాజమాన్యాలు సమావేశాలను కూడా ఆన్‌లైన్ ద్వారానే నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐ రాకతో భవిష్యత్తులో ఎలాంటి మార్పులు ఉంటాయనే ఆసక్తి నెలకొంది. తాజాగా దీనికి సంబంధించి సోషల్ మీడియా సైట్ లింక్‌డ్ఇన్ సహ-వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్‌మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో ఉద్యోగాల తీరు గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 2034 నాటికి ఏఐ కారణంగా ఇప్పుడున్న 9-5 ఉద్యోగాలు ఉండవని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఉద్యోగులు ఒకే చోట, ఒకే రకమైన ఉద్యోగం చేయరని, ఏక కాలంలో వివిధ కంపెనీలకు రకరకాల పనులు చేసే విధానం ఉంటుందని హాఫ్‌మన్ అంచనా వేశారు. మరో పదేళ్లలో ప్రస్తుతం ఉన్న సంప్రదాయ ఉద్యోగాలు ఉండకపోవచ్చని, తద్వారా అవకాశాలు, సమస్యలు ఉంటాయని చెప్పారు. ఒకే రకమైన ఉద్యోగాలు, ఎక్కువ కాలం ఒకేచోట పనిచేయకపోవడం మూలంగా సవాళ్లు ఎదురవ్వొచ్చన్నారు. అలాగే, ఉద్యోగులు వివిధ కంపెనీలకు రకరకాల పనుచేయడం ద్వారా కంపెనీల ఉత్పాదకత పెరుగుతుందని హాఫ్‌మన్ పేర్కొన్నారు.

Advertisement

Next Story