హురున్ గ్లోబల్-500 జాబితాలో మళ్లీ రిలయన్స్‌దే అగ్రస్థానం

by S Gopi |
హురున్ గ్లోబల్-500 జాబితాలో మళ్లీ రిలయన్స్‌దే అగ్రస్థానం
X

దిశ, బిజినెస్ బ్యూరో: బిలీయనీర్ ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ తన హవా కొనసాగిస్తోంది. తాజాగా భారత్ నుంచి అత్యంత విలువైన కంపెనీల జాబితాలో మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. 2023 ఏడాదికి సంబంధించి హురున్ గ్లోబల్ టాప్-500 కంపెనీల జాబితా విడుదలైంది. ఈ జాబితాలో రిలయన్స్ సంస్థ 44వ ర్యాంకును సాధించింది. కంపెనీ విలువ పరంగా 2 శాతం తగ్గడంతో గతేడాది కంటే 10 స్థానాలు కోల్పోయిందని హురున్ గ్లోబల్ నివేదిక తెలిపింది. ప్రస్తుతం రిలయన్స్ సంస్థ రూ. 16.44 లక్షల కోట్ల మార్కెట్ విలువను కలిగి ఉంది.

హురున్ గ్లోబల్ టాప్-500 జాబితాలో రిలయన్స్ తర్వాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (60వ ర్యాంక్), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (68వ ర్యాంక్) ఉన్నాయి. టీసీఎస్ నికర విలువ సంవత్సర కాలంలో 14 శాతం పెరిగి రూ.13.12 లక్షల కోట్లకు చేరుకుంది. 2023లో కంపెనీ ర్యాంక్ ఐదు స్థానాలు మెరుగుపడింది. ఇక, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో హెచ్‌డీఎఫ్‌సె విలీనం కారణంగా సంస్థ విలువ అనూహ్యంగా పెరిగింది. ఈ కారణంతోనే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఈ జాబితాలో 43 శాతం మెరుగుపరుచుకోవడం విశేషం. ఇవి కాకుండా భారత్ నుంచి టైటాన్, సన్‌ఫార్మాలు హురున్ గ్లోబల్-500 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అదానీ గ్రూపునకు చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ టోటల్ గ్యాస్ కంపెనీలు జాబితా నుంచి తప్పుకున్నాయి. మొత్తంగా ఈ జాబితాలో 18 కంపెనీలతో భారత్ ఆరో స్థానంలో ఉంది. గ్లోబల్ ర్యాంకుల్లో యాపిల్ మొదటిస్థానంలో నిలవగా, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, అమెజాన్, ఎన్‌విడియాలు మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. ఈ కంపెనీలన్నిటి మార్కెట్ విలువ 1 ట్రిలియన్ డాలర్లను అధిగమించడం గమనార్హం.

Advertisement

Next Story