భారత కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద సిండికేట్ రుణం తీసుకున్న రిలయన్స్!

by Harish |   ( Updated:2023-04-05 10:13:49.0  )
భారత కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద సిండికేట్ రుణం తీసుకున్న రిలయన్స్!
X

ముంబై: దేశీయ అతిపెద్ద సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని అనుబంధ జియో ఇన్ఫోకామ్‌లు 5 బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో రూ. 41,000 కోట్లు) విదేశీ రుణాలను సేకరించింది. ఇది భారత కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద సిండికెట్ రుణమని వ్యాపార వర్గాలు వెల్లడించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) గతవారం 55 బ్యాంకుల నుంచి 3 బిలియన్ డాలర్లు అంటే రూ. 24,600 కోట్ల రుణాలను సేకరించగా, జియో 18 బ్యాంకుల నుంచి మరో 2 బిలియన్ డాలర్ల(రూ. 16,400 కోట్ల) రుణాన్ని పొందింది.

జియో తన రుణాల ద్వారా దేశంలో 5జీ నెట్‌వర్క్ అభివృద్ధికి, మూలధన వ్యయం కోసం వాటిని ఉపయోగించనుంది. మరోవైపు రిలయన్స్ సంస్థ గత కొన్నేళ్ల నుంచి నిధుల సమీకరణ విషయంలో సిండికేటెడ్ రుణ మార్కెట్లో క్రియాశీలకంగా లేదు. ఈ క్రమంలోనే బడా కంపెనీకి రుణాలివ్వడానికి సిండికేట్ మార్కెట్ సానుకూలంగా ఉండటంతో మూలధన వ్యయం కోసం నిధులు సేకరించాలని రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఆర్ఐఎల్‌కు రుణాలిచ్చిన 55 విదేశీ బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ అమెరికా, హెచ్ఎస్‌బీసీ, సిటీ, ఎస్ఎంబీసీ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలున్నాయి. వీటిలో సుమారు 20 తైవాన్ బ్యాంకులున్నాయి. జియో సైతం 5జీ వ్యాపారంలో మరింత వేగంగా విస్తరించేందుకు భారీస్థాయిలో ఖర్చు చేస్తోంది. అందుకే కొత్తగా తీసుకున్న రుణాల ద్వారా నెట్‌వర్క్ విస్తరణ, రిటైల్ వ్యాపార వృద్ధిని వాడనున్నట్టు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement

Next Story