తిరిగి 63 వేల మార్కు దాటిన సెన్సెక్స్!

by Vinod kumar |   ( Updated:2023-06-07 14:46:15.0  )
తిరిగి 63 వేల మార్కు దాటిన సెన్సెక్స్!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్‌లో భారీ ర్యాలీని చేశాయి. ఉదయం నుంచే సానుకూలంగా కదలాడిన సూచీలు మిడ్-సెషన్ వరకు ఓ మోస్తరుగా కదలాడాయి. ఆ తర్వాత గురువారం ఆర్‌బీఐ తన ప్రకటనలో కీలక రేట్లను యథాతథంగా కొనసాగించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల దిగొస్తున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఈ సంకేతాలు మదుపర్ల సెంటిమెంట్‌ను పెంచాయి. దీనికితోడు గ్లోబల్ మార్కెట్లు సానుకూలంగా ఉండటం, విదేశీ పెట్టుబడిదారులు భారత ఈక్విటీల్లో నిధులను కొనసాగించడంతో మార్కెట్లు అధిక లాభాలకు మారాయి. ఈ క్రమంలోనే 2023లో అధిక స్థాయిలను సూచీలు తాకడంతో సెన్సెక్స్ తిరిగి 63 వేల మార్కును అధిగమించింది.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 350.08 పాయింట్లు ఎగసి 63,142 వద్ద, నిఫ్టీ 127.40 పాయింట్లు లాభపడి 18,726 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్, రియల్టీ, ఎఫ్ఎంసీజీ రంగాలు అత్యధికంగా బలపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో నెస్లె ఇండియా, టాటా స్టీల్, టాటా మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్, ఎల్అండ్‌టీ, పవర్‌గ్రిడ్, టీసీఎస్, ఎన్‌టీపీసీ కంపెనీల షేర్లు అధిక లాభాలను సాధించాయి. కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ సుజుకి స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.50 వద్ద ఉంది.

Advertisement

Next Story