cheque clearance: డిపాజిట్ చేసిన అదే రోజు చెక్ క్లియరెన్స్‌

by Harish |
cheque clearance: డిపాజిట్ చేసిన అదే రోజు చెక్ క్లియరెన్స్‌
X

దిశ, బిజినెస్ బ్యూరో: క్షణాల్లో ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్‌కు డబ్బు ట్రాన్స్‌ఫర్ జరుగుతున్న కాలంలో కూడా ప్రస్తుతం చెక్కులను నగదు రూపంలో మార్చడానికి రెండు రోజులు సమయం పడుతుండగా, దీని వలన చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఈ సమస్య పరిష్కారానికి దృష్టి పెట్టిన ఆర్‌బీఐ, చెక్కులను డిపాజిట్ చేసిన అదే రోజు క్లియర్ చేయాలని నిర్ణయించింది. దీంతో ఎవరైనా తమ పేరు మీద చెక్కు ఇస్తే దాన్ని కొన్ని గంటల్లోనే నగదు రూపంలో మార్చుకోవచ్చు. వినియోగదారుల బ్యాంకింగ్‌ అనుభవాన్ని మరింత మెరుగుపరిచే ఉద్దేశంతో ప్రస్తుతం, చెక్కుల క్లియరెన్సుకు అమలవుతున్న విధానంలో మార్పులు తెచ్చి క్లియరెన్సును కొన్ని గంటలకు తగ్గిస్తామని ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాల వెల్లడి సందర్భంగా గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు.

ప్రస్తుతం,చెక్ క్లియరింగ్ చెక్ ట్రంకేషన్ సిస్టమ్(CTS) ద్వారా బ్యాచ్ ప్రాసెసింగ్ మోడ్‌లో పనిచేస్తుంది, దీంతో క్లియరింగ్‌కు రెండు పని దినాల వరకు పడుతుంది. అయితే ఇకపై ఆన్‌ రియలైజేషన్‌ సెటిల్‌మెంట్‌ విధానాన్ని అవలంబించి దానిని వేగంగా స్కాన్‌ చేసి, పాస్ చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలో జారీ చేస్తామని దాస్‌ తెలిపారు. UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్), NEFT (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్), RTGS (రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్) ద్వారా లావాదేవీలు పెరుగుతున్న సమయంలో చెక్‌ల ప్రాముఖ్యత చాలా వరకు తగ్గుతుంది. దీంతో క్లియరింగ్ సమస్యను తగ్గించి అదే రోజు నగదు అందేలా చేస్తామని దాస్‌ చెప్పారు.

Advertisement

Next Story