సైబర్ మోసాలను అరికట్టేందుకు చర్యలకు సిద్ధమవుతున్న ఆర్‌బీఐ

by S Gopi |
సైబర్ మోసాలను అరికట్టేందుకు చర్యలకు సిద్ధమవుతున్న ఆర్‌బీఐ
X

దిశ, బిజినెస్ బ్యూరో: పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరాలను అరికట్టేందుకు ఆర్‌బీఐ కీలక చర్యలు తీసుకోనుని. సైబర్ దాడులను నియంత్రించేందుకు అనుమానాస్పదంగా ఉండే ఖాతాలను తాత్కాలికంగా సీజ్ చేసేందుకు బ్యాంకులకు అనుమతిస్తూ మార్గదర్శకాలను తీసుకురావాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) భావిస్తోంది. 2021 నుంచి సైబర్ మోసాల కారణంగా దాదాపు రూ. 10,500 కోట్లకు పైగా ఆర్థిక మోసాలకు సామాన్యులు బలయ్యారని అంతర్గత ప్రభుత్వ డేటా వచ్చిన నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. రోజుకు 4,000 మోసపూరిత అకౌంట్లు ప్రారంభమవుతున్నట్టు గణాంకాల్లో తేలింది. వేలాది మందికి ఫోన్‌కాల్స్ ద్వారా తమ బ్యాంకులు ఖాతాలు, వ్యాలెట్లను మోసపూరితంగా యాక్సెస్ చేసి సైబర్ మోసగాళ్లు తమ అకౌంట్లకు డబ్బును బదిలీ చేసుకుంటున్నారు. ఇటువంటి అకౌంట్లను నిలిపేయడానికి బ్యాంకులకు అనుమతులివ్వనుంది. దీని ద్వారా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఖాతాను తనిఖీ చేసేందుకు సమయం ఉంటుందని ఆర్‌బీఐ భావిస్తోంది. నేరస్థులు నిమిషాల్లో బ్యాంకు ఖాతాల్లో సొమ్మును ఖాళీ చేయగలరు. ప్రస్తుతం పోలీసులు నేరం గురించి ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత మాత్రమే బ్యాంకులు అనుమానిత ఖాతాలను ఫ్రీజ్ చేయగలవు. దీనికి కొన్నిరోజుల సమయం పడుతుంది. కాబట్టి తక్షణం సైబర్ నేరాల నుంచి రక్షణకు అనుమానిత ఖాతాలను ఫ్రీజ్ చేసేలా బ్యాంకులకు అనుమతిస్తే చాలావరకు సిబర్ దాడులను నియంత్రించవచ్చు. దీనిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖ, సెంట్రల్ బ్యాంకును సంప్రదించగా బదులు రాలేదు.

మార్గదర్శకాలను హోం మంత్రిత్వ శాఖకు చెందిన సైబర్ ఫ్రాండ్ ఫైటింగ్ ఏజెన్సీ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా బ్యాంకులకు ఆదేశాలివ్వనున్నారు. ఈ ఏజెన్సీ డేటా ప్రకారం, గత మూడు నెలల్లో ప్రభుత్వం ఇటువంటి సైబర్ మోసాలకు పాల్పడినట్టు అనుమానం ఉన్న 2.50 లక్షల ఖాతాలను తాత్కాలికంగా నిలిపేసినట్టు ప్రభుత్వం వర్గాలు పేర్కొన్నాయి. అయితే, చాలావరకు ఫిర్యాదులు నమోదు కానందున వేలాది మోసపూరిత ఖాతాలు నిరంతరం పనిచేస్తున్నాయి.

Advertisement

Next Story