మార్చి 30, 31 తేదీల్లో కూడా పనిచేయనున్న ఆర్‌బీఐ కార్యాలయాలు

by S Gopi |
మార్చి 30, 31 తేదీల్లో కూడా పనిచేయనున్న ఆర్‌బీఐ కార్యాలయాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ వ్యవహారాలు సజావుగా పూర్తి చేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఈ నెల 30,31 తేదీల్లో కార్యాలయాలు తెరిచే ఉంటాయని తెలిపింది. ఆఫీసులు సాధారణ పని గంటలు పనిచేస్తాయని, పన్ను చెల్లింపుదారుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్‌బీఐ వెల్లడించింది. ప్రభుత్వ రశీదులు, చెల్లింపులను సులభతరం చేసేందుకు, దేశవ్యాప్తంగా ప్రత్యేక క్లియరింగ్ కార్యకలాపాలను నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేసినట్టు సెంట్రల్ బ్యాంకు పేర్కొంది. మార్చి 30,31 రోజుల్లో ప్రభుత్వం చెక్కుల కోసం ప్రత్యేక క్లియరింగ్ నిర్వహించబడుతుంది. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్(నెఫ్ట్), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్(ఆర్‌టీజీఎస్) సిస్టమ్ ద్వారా జరిగే లావాదేవీలు కూడా కొనసాగుతాయి. ప్రభుత్వ ఖాతాలకు సంబంధించిన అన్ని చెక్కులను క్లియరింగ్ సమయంలో ఇవ్వొచ్చని ఆర్‌బీఐ ఏజెన్సీ బ్యాంకులకు సూచించింది. జీఎస్టీ, టీఐఎన్ 2.0, ఇండియన్ కస్టమ్స్ గేట్‌వే, ఈ-రసీదుల లగేజీ ఫైల్‌లను అప్‌లోడ్ చేయడంతో పాటు ఆర్‌బీఐకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ లావాదేవీల కోసం ఏప్రిల్ 1 మధ్యాహ్నం 12 గంటల వరకు ఆఫీసులు తెరిచే ఉంటాయని ఆర్‌బీఐ వివరించింది. ఆర్‌బీఐ కార్యాలయాలతో పాటు బ్యాంకులు, ఆదాయ పన్ను శాఖ ఆఫీసులు కూడా పన్ను చెల్లింపుదారుల కోసం తెరిచే ఉండనున్నాయి.

Advertisement

Next Story