కీలక రేట్లను స్థిరంగా కొనసాగించనున్న ఆర్‌బీఐ!

by Vinod kumar |
కీలక రేట్లను స్థిరంగా కొనసాగించనున్న ఆర్‌బీఐ!
X

ముంబై: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) మరోసారి కీలక రేట్లను యథాతథంగా కొనసాగించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ పరిస్థితులపై దృష్టి సారించే అవకాశం ఉంది. ఇటీవల సెప్టెంబర్‌లో రాయిటర్స్ నిర్వహించిన సర్వేలో 71 మంది ఆర్థికవేత్తలలో ఒకరు మినహా అందరూ ఆర్‌బీఐ తన కీలక రెపో రేటును 6.50 శాతం వద్దే ఉంచుతుందన్నారు. ఆ ఒకరు మాత్రం 25 బేసిస్ పాయింట్లు పెంచవచ్చని చెప్పారు. ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయిలోనే ఉన్నప్పటికీ, ప్రధాన రిటైల్ ధరలు తగ్గుముఖం పట్టాయి.

వాతావరణ పరిస్థితులు, వస్తువుల ధరలు, ప్రపంచ వృద్ధి ఆందోళనల మధ్య ద్రవ్యోల్బణంపై ఆర్‌బీఐ మెతక వైఖరిని కలిగి ఉండొచ్చని యెస్ బ్యాంక్ ఆర్థికవేత్తలు ఇంద్రనీల్, దీప్తి మాథ్యూ చెప్పారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఆగష్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ఠం 6.83 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. అధిక ద్రవ్యోల్బణం ఆర్థికవ్యవస్థ వృద్ధిని దెబ్బతీసే ప్రమాదం ఉన్నందున రేట్లను పెంచడం కంటే ద్రవ్య నిర్వహణపై దృష్టి సారించవచ్చని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. బుధవారం ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షా(ఎంపీసీ) సమావేశం మొదలైంది. 6న సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed