ఈ ఏడాది గణనీయంగా పెరగనున్న ప్రైవేట్ రంగ పెట్టుబడులు!

by Javid Pasha |
ఈ ఏడాది గణనీయంగా పెరగనున్న ప్రైవేట్ రంగ పెట్టుబడులు!
X

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ రంగ పెట్టుబడులు గణనీయంగా పెరుగుతాయని భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) కొత్త అధ్యక్షుడు ఆర్ దినేష్ అన్నారు. ఆదివారం జరిగిన ఓ ప్రకటనలో మాట్లాడిన ఆయన, ఈ ఆర్థిక సంవత్సరంలో పలు కీలక రంగాల్లో సామర్థ్య వినియోగం ఇప్పటికే 80 శాతం దాటిందని, తద్వారా పెట్టుబడులు పెరుగుతాయన్నారు. డిమాండ్‌ను తీవ్రంగా దెబ్బతీసిన కరోనా మహమ్మారి నుంచి తొందరగానే బయటపడ్డామని, ఇది మెరుగైన వృద్ధికి సంకేతమని అభిప్రాయపడ్డారు. సిమెంట్, ఉక్కు, రసాయనాలు, యంత్రాలు వంటి కీలక రంగాల్లో సామర్థ్య వినియోగం 80 శాతం ఉంటే, మిగిలిన రంగాల్లో 75 శాతం ఉందన్నారు.

ఈ క్రమంలో పైవేట్ రంగం మూలధన నిధులు భారీగా పెరగనున్నాయి. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వ్యయాలు పెంచడం, కంపెనీలు, బ్యాంకులు స్థిరమైన బ్యాలెన్ షీట్లను కొనసాగించడం పెట్టుబడులకు దోహదపడుతుంది. ప్రస్తుతం జర్మనీ మాంద్యంలోకి జారడం వల్ల భారత ఎగుమతులపై ప్రభావం ఉంటుందని, అయితే, అది దీర్ఘకాలం ఉండకపోవచ్చని ఆయన వివరించారు. కానీ పరిస్థితులు మరింత అధ్వాన్నంగా మారితే ఆందోళన చెందాల్సి ఉంటుందని పేర్కొన్నారు.


Advertisement

Next Story