దేశంలో భారీగా తగ్గిన సంపన్నుల విరాళాలు!

by Harish |
దేశంలో భారీగా తగ్గిన సంపన్నుల విరాళాలు!
X

న్యూఢిల్లీ: దేశంలో ఆల్ట్రా హై నెట్‌వర్త్ వ్యక్తులుగా(యూహెచ్ఎన్ఐ) ఉన్న సంపన్నుల విరాళాల్లో గతేడాది గణనీయమైన తగ్గుదల నమోదైందని భారత దాతృత్వ నివేదిక తెలిపింది. యూహెచ్ఎన్ఐలుగా పరిగణించబడే(రూ. వెయ్యి కోట్ల కంటే ఎక్కువ సంపద కలిగిన వారు) 2022లో రూ. 4,230 కోట్ల విరాళాలను మాత్రమే ఇచ్చారు. అంతకుముందు ఏడాది వీరు రూ. 11,821 కోట్ల విలువైన మొత్తాన్ని దాతృత్వానికి వినియోగించారు.

ప్రముఖ పరిశోధనా సంస్థ దస్రా, బైన్ అండ్ కో నివేదిక ప్రకారం, ఐటీ సంస్థ విప్రో షేర్ల బైబ్యాక్ కారణంగ అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ విరాళాలు రూ. 9 వేల కోట్లు తగ్గిపోవడంతో మొత్తం దాతృత్వం విలువ మూడింట ఒక వంతుకు పడిపోయింది. సంస్థ షేర్ల బైబ్యాక్ కోసం పూర్తిగా నగదు రూపంలో నిధులను వినియోగించడమే దీనికి కారణం.

అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ను మినహాయించినా కూడా యూహెచ్ఎన్ఐల విరాళం 2021లో రూ. 4,041 కోట్ల నుంచి 5 శాతం తగ్గి గతేడాది రూ. 3,843 కోట్లుగా ఉంది. సమీక్షించిన కాలంలో వీరి సంపద 9.2 శాతం పెరిగింది. ఇక, మొత్తంగా ప్రైవేట్ దాతృత్వ వృద్ధి అంతకుముందు ఏడాది స్థాయిలోనే రూ. 1.05 లఖ కోట్ల వద్ద ఉందని నివేదిక తెలిపింది.

అందులో కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) వ్యయం 5 శాతం పెరిగి రూ. 27 వేల కోట్లకు చేరుకుంది. రూ. 200-1,000 కోట్ల మధ్య సంపద కలిగిన వ్యక్తుల విరాళం 11 శాతం పెరిగింది. సీఎస్ఆర్ తర్వాత రిటైల్ రంగం నుంచి విరాళాలు 17 శాతం పుంజుకున్నాయి.

Advertisement

Next Story