రూ. 26 వేల కోట్ల నష్టం చూసిన పేటీఎం

by S Gopi |
రూ. 26 వేల కోట్ల నష్టం చూసిన పేటీఎం
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఆంక్షల ప్రభావంతో దెబ్బతిన్న పేటీఎం మరింత పతనాన్ని చూస్తోంది. కంపెనీ షేర్ ధర రోజురోజుకు పడిపోతోంది. బుధవారం సైతం పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ధర 10 శాతం క్షీణించి ఆల్‌టైమ్ కనిష్టానికి చేరుకుంది. రూ. 342.15 వద్ద 52 వారాల కనిష్టానికి దిగజారిన షేర్ ధర గతేడాది అక్టోబర్‌లో తాకిన రూ. 998 గరిష్ఠ స్థాయి నుంచి 65 శాతానికి పైగా కుదేలైంది. గత నెలాఖరు 31న ఆర్‌బీఐ పేటీఎంపై ఆంక్షలు విధించిన తర్వాత మొదలైన క్షీణత ఇప్పటివరకు 50 శాతం మేర తగ్గింది. దీంతో పేటీఎం షేర్లను కలిగి ఉన్న ఇన్వెస్టర్లకు రూ. 26 వేల కోట్ల నష్టాన్ని మిగిల్చింది. కంపెనీ మార్కెట్ విలువ కూడా రూ. 25 వేల కోట్లకు పైగా తగ్గింది. తాజా పరిణామాల మధ్య పేటీఎం ఇప్పట్లో కష్టాల నుంచి గట్టెక్కె సూచనలు కనిపించడంలేదు. కంపెనీపై విధించిన ఆంక్షల విషయంలో సమీక్ష ఉండకపోవచ్చని సోమవారం ప్రకటనలో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. ఈ కారణంతోనే వివిధ బ్రోకరేజీ సంస్థలు కూడా పేటీఎం షేర్ ధరను తగ్గించాయి. పేటీఎం ఫిబ్రవరి 29 నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదని ఆర్‌బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. కస్టమర్ అకౌంట్లు, ప్రీ పెయిడ్, వ్యాలెట్, ఫాస్ట్‌ట్యాగ్ సహా తదితర క్రెడిట్ లావాదేవీలు చేయకూడదని స్పష్టం చేసింది.

Advertisement

Next Story