చిన్న లావాదేవీల కోసం పేటీఎం పేమెంట్స్ యాప్‌లో యూపీఐ లైట్ ఫీచర్!

by Harish |
చిన్న లావాదేవీల కోసం పేటీఎం పేమెంట్స్ యాప్‌లో యూపీఐ లైట్ ఫీచర్!
X

న్యూఢిల్లీ: ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం కు చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వినియోగదారులకు కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తక్కువ మొత్తం లావాదేవీల కోసం ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని పేటీఎం వెల్లడించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్(ఎన్‌పీసీఐ) తెచ్చిన యూపీఐ లైట్ ఫీచర్‌ను పేటీఎం పేమెంట్ బ్యాంక్ యాప్‌లో ప్రారంభిస్తున్నట్టు బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదారులకు ఈ సౌకర్యాన్ని అందిస్తున్న మొదటి బ్యాంక్ తమదేనని పేటీఎం పేమెంట్స్ పేర్కొంది.

ఈ ఫీచర్ ద్వారా చిన్న మొత్తాల లావాదేవీలను సులభంగా చేయవచ్చని, పేటీఎం పేమెంట్స్ యూపీఐ లైట్ వ్యాలెట్‌లో గరిష్ఠంగా ఒకసారి రూ. 2 వేల వరకు ఉంచుకోవచ్చని బ్యాంకు వివరించింది. ఒకరోజులో రెండు సార్లు చేసుకోవడం ద్వారా రూ. 4 వేల డిపాజిట్ చేసుకునే వీలుంటుంది. ఈ మొత్తాన్ని తక్కువ మొత్తం లావాదేవీల కోసం వాడుకోవచ్చు. రూ. 200 వరకు లావాదేవీలను ఒకసారి క్లిక్ చేయడం ద్వారా రోజువారీ బ్యాంకుల లావాదేవీల పరిమితి గురించి ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు.

దేశవ్యాప్తంగా జరుగుతున్న మొత్తం యూపీఐ లావాదేవీల్లో ఎక్కువ భాగం రూ. 200 కంటే తక్కువ మొత్తాలవే ఉన్నాయి. వీటిని యూపీఐ లైట్ ద్వారా వేగవంతంగా నిర్వహించవచ్చు. యూపీఐ లైట్ ద్వారా జరిగే లావాదేవీలు కేవలం పేటీఎం పేమెంట్ బ్యాలెన్స్, హిస్టరీలో మాత్రమే కనిపిస్తాయని, బ్యాంకు పాస్‌బుక్‌లో నమోదు కావని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed