10 శాతం విమాన కార్యకలాపాలను తగ్గించిన విస్తారా

by S Gopi |
10 శాతం విమాన కార్యకలాపాలను తగ్గించిన విస్తారా
X

దిశ, బిజినెస్ బ్యూరో: పైలట్‌లపై ఒత్తిడిని తగ్గించేందుకు విమాన కార్యకలాపాలను రోజుకు 25-30 విమానాలకు తగ్గిస్తున్నట్టు విస్తారా ఆదివారం ప్రకటించింది. 98 శాతం పైలట్‌లు సవరించిన జీతాల కాంట్రాక్టుపై సంతకాలు చేశారని సంస్థ సీఈఓ చెప్పిన ఒకరోజు తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. తగ్గించిన విమానాలు చాలావరకు దేశీయ రూట్లలోనే ఉన్నాయని, ప్రయాణీకులు ఎదుర్కొంటున్న అసౌకర్యాన్ని తగ్గించేందుకు ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు విస్తారా పేర్కొంది. 'మొత్తం విమాన కార్యకలాపాల్లో 10 శాతానికి సమానమైన విమానాలను తగ్గించాలని నిర్ణయించాం. గత కొన్ని రోజులుగా విమానాల ఆన్‌టైమ్ పనితీరు మెరుగుపడింది. ఈ నెల, వచ్చే నెల నుంచి స్థిరంగా విమానాలు నడుస్తాయని ' విస్తారా ప్రతినిధి చెప్పారు. పైలెట్ల కొరత కారణంగా ఈ నెల ప్రారంభం నుంచి కంపెనీ విమానాల రద్దు, జాప్యాల సమస్యను ఎదుర్కొంటోంది. ఏప్రిల్‌ మొదటి మూడు రోజుల్లోనే కంపెనీ 125కు పైగా విమానాలను రద్దు చేసింది. ఎయిర్ ఇండియాలో విలీన ప్రక్రియలో ఉన్న విస్తారాలోని పైలట్లలో అసంతృప్తి వెల్లువెత్తుతోంది. కొత్త కాంట్రాక్టుల తరువాత ఫిక్స్‌డే పే తగ్గిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story