తొలిసారి రూ. లక్ష కోట్ల మార్కు దాటిన ఆన్‌లైన్ క్రెడిట్ కార్డు ఖర్చులు

by S Gopi |
తొలిసారి రూ. లక్ష కోట్ల మార్కు దాటిన ఆన్‌లైన్ క్రెడిట్ కార్డు ఖర్చులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో క్రెడిట్ కార్డు వినియోగం చాలా వేగంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఆన్‌లైన్ క్రెడిట్ కార్డు ఖర్చులు ఈ ఏడాది మార్చిలో తొలిసారిగా రూ. లక్ష కోట్ల మైలు రాయిని దాటిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సమీక్షించిన సమయానికి మొత్తం రూ. 1,04,081 కోట్ల ఆన్‌లైన్ క్రెడిట్ కార్డు ఖర్చులు జరిగాయని ఓ నివేదిక తెలిపింది. ఇది 2023, మార్చిలో జరిగిన రూ. 86,390 కోట్ల నుంచి 20 శాతం, 2024, ఫిబ్రవరిలో జరిగిన రూ. 94,774 కోట్ల కంటే 10 శాతం పెరిగింది. పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్ ద్వారా ఆఫ్‌లైన్ లావాదేవీలు మార్చిలో రూ. 60,378 కోట్లుగా ఉన్నాయి. ఇది గతేడాది కంటే 19 శాతం పెరిగింది. దీంతో ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం క్రెడిట్ కార్డు లావాదేవీలు గతేడాది కంటే 20 శాతం వృద్ధితో రూ. 1,64,586 కోట్లకు చేరాయి. ఇక, దేశంలో మొత్తం క్రెడిట్ కార్డుల సంఖ్య ఫిబ్రవరిలో 10 కోట్ల మార్కును దాటగా, మార్చి చివరి నాటికి 10.2 కోట్లకు చేరుకున్నాయి. గతేడాది మార్చి నాటికి మొత్తం 8.5 కోట్ల క్రెడిట్ కార్డులు వినియోగంలో ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం నాటికి హెచ్‌డీఫ్‌సీ బ్యాంక్ 20.2 శాతంతో అతిపెద్ద క్రెడిట్ కార్డు మార్కెట్ వాటను కలిగి ఉంది. ఆ తర్వాత ఎస్‌బీఐ(18.5 శాతం), ఐసీఐసీఐ బ్యాంక్(16.6 శాతం), యాక్సిస్ బ్యాంక్(14 శాతం), కోటక్ మహీంద్రా బ్యాంక్(5.8 శాతం) కలిగి ఉన్నాయి. క్రెడిట్ కార్డులు జారీ చేసే మొదటి 10 బ్యాంకులు 90 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండటం గమనార్హం.

Advertisement

Next Story