ఒక్క బిస్కెట్ తక్కువైనందుకు ఫిర్యాదు.. రూ. లక్ష జరిమానా!

by Shiva |   ( Updated:2023-09-06 12:21:26.0  )
ఒక్క బిస్కెట్ తక్కువైనందుకు ఫిర్యాదు.. రూ. లక్ష జరిమానా!
X

చెన్నై: దేశీయ అతిపెద్ద ఎఫ్ఎంసీజీ సంస్థ ఐటీసీ ఒకే ఒక్క బిస్కెట్ కోసం రూ. లక్ష చెల్లించిందంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. దేశంలోనే అతిపెద్ద బిస్కెట్ తయారీ కంపెనీ అయినప్పటికీ ఐటీసీ సంస్థ బిస్కెట్ ప్యాకింగ్‌లో విఫలమైంది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలోని 'సన్‌ఫీస్ట్ మేరీ లైట్'లో 16 బిస్కెట్లకు బదులు పదిహేను మాత్రమే ప్యాక్ చేయడంతో చెన్నైకి చెందిన ఓ వినియోగదారుడికి రూ. లక్ష జరిమానా చెల్లించాలని వినియోగదారుల కోర్టు ఆదేశించింది.

చెన్నైకి చెందిన ఢిల్లీబాబు అనే వ్యక్తి 2021, డిసెంబర్‌లో ఒక రిటైల్ స్టోర్ నుంచి సన్‌ఫీస్ట్ మేరీ లైట్ బిస్కెట్ కొనుగోలు చేశారు. ప్యాకెట్ పైన 16 బిస్కెట్లు అని రాసి ఉంది. తెరిచి చూస్తే 15 బిస్కెట్లు మాత్రమే కనిపించాయి. దీనిపై వివరణ కోరిన ఢిల్లీ బాబుకి ఐటీసీ సరైన విధంగా స్పందించలేదు. దాంతో ఒక్కో బిస్కెట్ ఖరీదు 75 పైసలు అని, ఐటీసీ రోజుకు దాదాపు 50 లక్షల ప్యాకెట్లను తయారు చేస్తుందని, ఎన్వలప్ లెక్కల ప్రకారం ప్రజలను రూ. 29 లక్షలకు పైగా మోసం చేసిందంటూ వినియోగదారుల కోర్టుకు ఫిర్యాదు చేశారు.

ప్యాకేట్‌పై ఉన్న విధంగా కాకుండా బిస్కెట్ల సంఖ్య తక్కువగా ఉండటాన్ని వినియోగదారుల కోర్టు తీవ్రంగా పరిగణించింది. ప్యాకెట్‌పై ఉన్నదానికంటే ఒకటి తక్కువగా ఉండటాన్ని తప్పుబట్టడమే కాకుండా, ప్రకటనల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నందుకు వినియోగదారుడికి రూ. లక్ష పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాకుండా, ఆ బ్యాచ్ బిస్కెట్ల తయారీని నిలిపేయాలని కూడా పేర్కొంది.

Advertisement

Next Story