Ola Electric IPO : ప్రారంభమైన ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ.. పూర్తి వివరాలు ఇవే..

by Harish |
Ola Electric IPO : ప్రారంభమైన ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ.. పూర్తి వివరాలు ఇవే..
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ చాలా కాలంగా ఐపీఓకు రావాలని ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆగస్టు 2న ఐపీఓ ప్రారంభమైంది. ఇది 6వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. దీనిలో ఒక్కో షేరుకు రూ.72-76 ధర నిర్ణయించారు. కొనుగోలుదారులు కనీసం ఒక్క లాట్ 195 షేర్లను రూ.14,820తో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కంపెనీ ఉద్యోగులు కూడా ఈ ఐపీఓలో పాల్గొనవచ్చు. వారికి ప్రత్యేకంగా ఒక్కో షేరుపై రూ.7 రాయితీ ఉంది. ఐపీఓ కేటాయింపు ఆగస్టు 7న ఉంటుంది. షేర్ల కేటాయింపులు జరగని వారికి రీఫండ్ తేదీ ఆగస్టు 8న జరుగుతుంది. మార్కెట్లో లిస్టింగ్ తేదీ ఆగస్టు 9న ఉంటుంది.

ఈ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా ఓలా రూ.6,100 కోట్లు సమీకరించనుంది. వీటిలో రూ.5,500 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లు తాజా ఇష్యూ ద్వారా జారీ చేశారు. ఈ ఐపీఓలో పెట్టుబడిదారులు, ప్రమోటర్లు ఆఫర్ ఫర్ సేల్ క్రింద 8.49 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయిస్తున్నారు. వీటిలో భవిష్ అగర్వాల్, దాదాపు 3.8 కోట్ల షేర్లను అమ్మకానికి ఉంచారు. 75 శాతం క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారులకు, 10 శాతం రిటైల్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వ్ చేశారు.

ఓలా ఎలక్ట్రిక్ పబ్లిక్ సబ్‌స్క్రిప్షన్‌కు ముందు యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా రూ. 2,763 కోట్లను సమీకరించింది. మొత్తం ఈ ఐపీఓ ద్వారా వచ్చిన నిధుల్లో రూ. 1,227.6 కోట్లు దాని సెల్ తయారీ ప్లాంట్ సామర్థ్యాన్ని 5 GWh నుండి 6.4 GWhకి విస్తరించడానికి, పరిశోధన, ఉత్పత్తి అభివృద్ధికి రూ.1,600 కోట్లు, రుణాలను చెల్లించడానికి రూ.800 కోట్లను ఉపయోగించనున్నారు. ఈ ఐపీఓ ద్వారా ఓలా దలాల్ స్ట్రీట్‌లోకి అడుపెట్టిన మొట్టమొదటి భారతీయ ఈవీ ద్విచక్ర వాహన సంస్థగా అవతరిస్తుంది.

Advertisement

Next Story