ఆరు ప్రధాన నగరాల్లో స్థిరంగా ఆఫీస్ అద్దెలు!

by Javid Pasha |
ఆరు ప్రధాన నగరాల్లో స్థిరంగా ఆఫీస్ అద్దెలు!
X

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అందుబాటులో ఉండే కొత్త నిర్మాణాలు 32 శాతం పెరిగినందున ఏప్రిల్-జూన్ మధ్య ఆరు ప్రధాన నగరాల్లో ఆఫీసుల అద్దెలు చదరపు అడుగుకు రూ. 95 చొప్పున స్థిరంగా ఉన్నాయని ఓ నివేదిక తెలిపింది. అయితే, డిమాండ్ కూడా సగటున 2 శాతం పెరిగింది. ప్రముఖ రియల్టీ కన్సల్టెంట్ సంస్థ కొలియర్స్ ఇండియా హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, చెన్నై, పూణె నగరాలకు సంబంధించి త్రైమాసిక డేటాను బుధవారం విడుదల చేసింది. టెక్, ఇంజనీరింగ్, ఉత్పాదక రంగాల అధిక డిమాండ్ వల్ల ఆఫీస్ స్పేస్ లీజింగ్ 2 శాతం వృద్ధితో 1.46 కోట్ల చదరపు అడుగులకు పెరిగింది. లీజింగ్ కార్యకలాపాల్లో ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబైని దాటి చెన్నైలో డిమాండ్ మూడు రెట్లు పెరిగింది. కొత్త ఆఫీసుల సరఫరా 32 శాతం పెరిగి 1.24 కోట్ల చదరపు అడుగులకు చేరుకుంది.

డిమాండ్ పెరిగినప్పటికీ, సఫరా మూడు రెట్లు పెరిగిందని, అందుకే ఆఫీసుల అద్దెలు దాదాపు స్థిరంగా ఉన్నాయని కొలియర్స్ ఇండియా ఆఫీస్ సర్వీసెస్ ఎండీ పీష్ జైన్ అన్నారు. రానున్న త్రైమాసికాల్లో డిమాండ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్న కారణంగా 2023 చివరి నాటికి అద్దెలు కూడా పెరుగుతాయని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ డిమాండ్ 22 శాతం క్షీణించగా, కొత్త ఆఫీసుల సరఫరా కూడా 19 శాతం తగ్గింది. ఆఫీసుల అద్దెలు చదరపు అడుగుకు రూ. 73.6 నుంచి రూ. 73.7తో దాదాపు స్థిరంగా ఉన్నాయని కొలియర్స్ ఇండియా పేర్కొంది.


Advertisement

Next Story