ఐదు నెలల్లో 70 లక్షల కొత్త మ్యూచువల్ ఫండ్ అకౌంట్లు!

by srinivas |
ఐదు నెలల్లో 70 లక్షల కొత్త మ్యూచువల్ ఫండ్ అకౌంట్లు!
X

ముంబై: దేశంలో డిజిటల్ వినియోగం, మ్యూచువల్ ఫండ్స్ గురించి అవగాహన పెరగడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెలల్లో కొత్త మ్యూచువల్ ఫండ్స్ అకౌంట్లు భారీగా పెరిగాయని ఎంఎఫ్ అసోసియేషన్ వెల్లడించింది. సమీక్షించిన కాలంలో అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల(ఏఎంసీ) వద్ద మొత్తం 70 లక్షల కొత్త అకౌంట్లు నమోదయ్యాయి.

దీంతో మొత్తం మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) ఖాతాలు 13.65 కోట్లకు చేరుకున్నాయి. ఆన్‌లైన్ ద్వారా మదుపునకు అవకాశాలు, ఎంఎఫ్ పెట్టుబడులపై అవగాహన పెరగడమే దీనికి కారణమని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(ఏఎంఎఫ్ఐ) ఓ ప్రకటనలో తెలిపింది. 2021-22లో 3.17 కోట్ల కొత్త ఎంఎఫ్ అకౌంట్లు పెరగ్గా, అంతకుముందు 2020-21లో 81 లక్షల కొత్త అకౌంట్లు నమోదయ్యాయి. ఎంఎఫ్ అకౌంట్లు భారీ సంఖ్యలో పెరగడం ద్వారా ఈక్విటీ మార్కెట్లలో కొత్త మదుపర్లకు ఉన్న ఆసక్తిని సూచిస్తుందని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా రిస్క్ ప్రభావం తక్కువగా ఉండే ఎంఎఫ్‌లపై కొత్త ఇన్వెస్టర్లకు ఆసక్తి ఎక్కువగా ఉందని తెలిపారు. నోట్ల రద్దు తర్వాత చాలామంది పొదుపు చేసేందుకు సిద్ధమయ్యారు. దీనికితోడు కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత రిస్క్ ఉన్నా సరే కొత్త జనరేషన్ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించారు. ఈ పరిణామాలతో ఎంఎఫ్‌లలో కొత్త అకౌంట్లు ఎక్కువగా పెరుగుతున్నాయని మోతీలాల్ ఓస్వాల్ అసెట్ మేనేజ్‌మెంట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అఖిల్ చతుర్వేది పేర్కొన్నారు.

Advertisement

Next Story