Meta Layoffs: మరోసారి వేలాది మంది ఉద్యోగుల తొలగింపు యోచనలో మెటా!

by Prasanna |
Meta Layoffs: మరోసారి వేలాది మంది ఉద్యోగుల తొలగింపు యోచనలో మెటా!
X

శాన్‌ఫ్రాన్సిస్కో: ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా మరోసారి వేలాది మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు తెలుస్తోంది. కొన్ని నెలలుగా టెక్ దిగ్గజ కంపెనీల్లో లేఆఫ్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. గతవారం నుంచి కొంత నెమ్మదించినట్టు కనిపించిన ఈ తొలగింపుల ప్రక్రియ, మళ్లీ ప్రారంభం కానుంది. గతేడాది నవంబర్‌లో 11 వేల మందిని ఇంటికి సాగనంపిన మెటా, ఈసారి కూడా వేలమందిని తీసేయనున్నట్టు బ్లూమ్‌బర్గ్ నివేదిక తెలిపింది. ఈ వారంలో దీనికి సంబంధించిన ప్రకటన ఉండొచ్చని సమాచారం. మెటా సంస్థకు ఇటీవల యాడ్స్ ఆదాయం బాగా క్షీణించింది. దీనికితోడు పెరుగుతున్న వ్యయం, ఆర్థిక పరమైన లక్ష్యాలను అందుకోవడంలో ఇబ్బందులు పెరిగిన నేపథ్యంలో ఖర్చులను తగ్గించడానికి ఉద్యోగుల తొలగింపు అనివార్యమని భావిస్తోంది. సంస్థలో సాధ్యమైనంత వరకు అవసరం ఉన్న ఉద్యోగులను మాత్రమే ఉంచుకుని, మిగిలిన వారిని తొలగించాలని మెటా యోచిస్తోంది. దాంతో ఈసారి కూడా వేలాది మంది ఉద్యోగులు ఇంటికి వెళ్లక తప్పదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో మెటా వర్చువల్ రియాలిటీ ప్లాట్‌ఫామ్ కోసం ఎక్కువ కృషి చేస్తోంది. అందులో పెట్టుబడుల కోసం గతేడాది తొలగించిన దాని కంటే ఎక్కువ సంఖ్యలో తొలగింపుల గురించి మెటా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story