గోఫస్ట్ కోసం బిడ్ వేసిన స్పైస్‌జెట్ ప్రమోటర్, బిజీ బీ ఎయిర్‌లైన్

by S Gopi |
గోఫస్ట్ కోసం బిడ్ వేసిన స్పైస్‌జెట్ ప్రమోటర్, బిజీ బీ ఎయిర్‌లైన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: నగదు కొరతను ఎదుర్కొంటున్న విమానయాన సంస్థ గోఫస్ట్ కోసం మరో ఎయిర్‌లైన్ స్పైస్‌జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్, బిజీ బీ ఎయిర్‌వేస్ సంయుక్తంగా బిడ్‌ను సమర్పించారు. స్పైస్‌జెట్ కంపెనీ కొత్త ఎయిర్‌లైన్‌కు నిర్వహణ భాగస్వామిగా.. అవసరమైన సిబ్బంది, సేవలు, పరిశ్రమ నైపుణ్యాన్ని అందించనుంది. ఈ బిడ్ ద్వారా దేశీయ విమానయాన రంగం పునర్నిర్మాణానికి, పరిశ్రమ వృద్ధికి స్పైస్‌జెట్ సామర్థ్యం ఉపయోగపడుతుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. 'గోఫస్ట్‌కు పరిశ్రమలో ఉన్న సామర్థ్యం పనికి వస్తుందని భావిస్తున్నాం. రెండు సంస్థలు కలిస్తే ప్రయోజనాలు మెండుగా ఉంటాయని' అజయ్ సింగ్ చెప్పారు. 'దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో స్లాట్‌లు, అంతర్జాతీయ ట్రాఫిక్ హక్కులు, 100కి పైగా ఎయిర్‌బస్ నియో విమానాల ఆర్డర్‌తో పాటు గోఫస్ట్ విశ్వసనీయమైన బ్రాండ్. ఈ సంస్థను పునరుద్ధరించడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు' ఆయన పేర్కొన్నారు. గతేడాది ఇంజన్‌ల సమస్యలతో గోఫస్ట్ సంస్థ సగానికి పైగా విమానాలు నిలిచిపోవడంతో ఈ చౌకధరల విమానాయాన సంస్థకు ఆర్థిక సమస్యలు తీవ్రమయ్యాయి. కేవలం 6-8 నెలల్లోనే ఇంజన్‌లలో సమస్యలు తలెత్తడం, ఇంజన్‌ల సరఫరాలో ఆలస్యం కారణంగా సంస్థ పరిస్థితి దివాలాకు దారితీసింది. ఈ క్రమంలో ఈ సంస్థకు సర్వీస్ ప్రొవైడర్‌గా వ్యహరించి ఆదాయాన్ని పెంచుకోవాలని స్పైస్‌జెట్ భావిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed