LIC: బీమా దిగ్గజం ఎల్ఐసీ 68వ వార్షికోత్సవ వేడుకలు

by S Gopi |
LIC: బీమా దిగ్గజం ఎల్ఐసీ 68వ వార్షికోత్సవ వేడుకలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ దిగ్గజ బీమా సంస్థ ఎల్ఐసీ ఆఫ్ ఇండియా 68వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. హైదరాబాద్‌లోని సైఫాబాద్‌ జోనల్ ఆఫీస్ భవనంలో ఎల్ఐసీ ఆఫ్ ఇండియా సౌత్ సెంట్రల్ జోన్ మేనేజర్ శ్రీ పునీత్ కుమార్ ఎల్ఐసీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. 1956లో రూ. 5 కోట్ల ప్రారంభ మూలధనంతో మొదలైన ఎల్ఐసీ 2024 నాటికి ప్రపంచంలోనే ఉత్తమ బీమా బ్రాండ్‌గా నిలిచింది. సంస్థలో మొత్తం 98000 మంది ఉద్యోగులు, 14 లక్షల కంటే ఎక్కువ మంది ఏజెంట్లు ఉన్నారు. ప్రస్తుతం సంస్థ దేశంలోని ప్రతి మూల సేవలందిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలోనూ ఎల్ఐసీ ఆరు కొత్త ప్లాన్‌లను తీసుకొచ్చింది. వాటిలో జీవన్ ఉత్సవ్ ప్లాన్ 13వ ఎడిషన్ ఫిన్నోవిటీ కాన్‌క్లేవ్ అవార్డును గెలుచుకుందని అన్నారు. వినియోగదారుల సంక్షేమానికి అంకితభావంతో పనిచేయాలని పునీత్ కుమార్ ఉద్యోగులకు సూచించారు. 'మీ సంక్షేమం మా బాధ్యత' అనే నినాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులు, ఫీల్డ్ సిబ్బంది కృషి చేయాలని, సంస్థ మరింత ఉన్నతస్థాయికి చేరేందుకు పనిచేయాలని పిలుపునిచ్చారు. కస్టమర్ల సమస్యలను పరిష్కరించేందుకు ఎల్ఐసీ పటిష్టమైన యంత్రాంగాన్ని కలిగి ఉంది. 98.6 శాతం ఫిర్యాదులను 15 రోజుల్లోనే పరిష్కరిస్తున్నాం. దేశవ్యాప్తంగా కస్టమర్ల కోసం 74 కస్టమర్ జోన్‌లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ సతీష్ బాబు, ఉతుప్ జోసెఫ్, సరస్వతి గోపకుమార్, ఆర్ఎల్ఎన్ స్వామి, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story