టైర్1, టైర్2 నగరాలపై దృష్టి సారించిన లాంబొర్ఘీని!

by Vinod kumar |   ( Updated:2023-03-12 16:45:51.0  )
టైర్1, టైర్2 నగరాలపై దృష్టి సారించిన లాంబొర్ఘీని!
X

ముంబై: ప్రధాన నగరాల్లో మెరుగైన అమ్మకాలను సాధిస్తున్న లగ్జరీ కార్ల తయారీ సంస్థ లాంబొర్ఘీని భారత్‌లోని ఇతర మార్కెట్లకు విస్తరించాలని భావిస్తోంది. దేశంలో పెరుగుతున్న పారిశ్రామికవేత్తలు, దేశ ఆర్థిక వృద్ధి, పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతున్న రోడ్డు మౌలిక సదుపాయాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ టైర్1, టైర్2 పట్టణాల్లోని వినియోగదారులకు చేరువ కావాలనే లక్ష్యంతో ఉంది. కొన్నేళ్ల క్రితం వరకు పెద్ద నగరాలు, మెట్రోల్లో మాత్రమే లాంబొర్ఘీని కార్లకు డిమాండ్ ఉంది. ఇప్పుడు ఇతర నగరాలకూ విస్తరించింది. ప్రస్తుతం 50 నగరాల్లో కంపెనీ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇటీవల తాము 100 నగరాల్లో నిర్వహించిన కార్యక్రమంలో వినియోగదారుల నుంచి ఆసక్తిని గమనించాం. ముఖ్యంగా కంపెనీకి టైర్1, టైర్2 నగరాల నుంచి 25 శాతం ఆదాయం వస్తోంది.

ఈ ప్రాంతాలపై మరింత దృష్టి సారించి విస్తరణ చేపట్టాలని నిర్ణయించినట్టు లాంబొర్ఘీని ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ అన్నారు. కాగా, లాంబొర్ఘిని 2007లో దేశీయంగా కార్యకలాపాలను ప్రారంభించింది. గతేడాది 33 శాతం వృద్ధితో 92 యూనిట్లను విక్రయించింది. కంపెనీ భారత మార్కెట్లో ప్రీమియం ఎస్‌యూవీ ఉరుస్‌తో పాటు హురకాన్ టెక్నికా, అవెంటడోర్ కార్లను కలిగి ఉంది. వీటి ధరలు రూ. 3 కోట్ల నుంచి ప్రారంభమవుతాయి. ఇదివరకు తమ కార్లను ఏళ్లుగా వ్యాపారంలో ఉన్న వారు కొనుగోలు చేసేవారు, ఇప్పుడు మొదటి తరం పారిశ్రామికవేత్తలు ఎక్కువగా కొనడం గమనిస్తున్నామని శరద్ అగర్వాల్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి : సాఫ్ట్‌డ్రింక్ అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి!

Advertisement

Next Story