JP Morgan: ఇండియాలో విస్తరణకు చూస్తున్న JP మోర్గాన్

by Harish |
JP Morgan: ఇండియాలో విస్తరణకు చూస్తున్న JP మోర్గాన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారుల చూపు భారత్‌పై పడింది. గత కొన్నేళ్లుగా దేశంలోకి వివిధ రంగాల్లో ఇన్వెస్ట్‌మెంట్‌లు భారీగా పెరుగుతున్నాయి. దీంతో వివిధ అంతర్జాతీయ సంస్థలు తమ కార్యకలపాలను భారత్‌లో కూడా విస్తరించాలని చూస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ కంపెనీ జేపీ మోర్గాన్‌(JPMorgan) భారతదేశంలో తన కార్యకలాపాలను పెంచుకోవాలని యోచిస్తోంది. దాని ఉన్నతాధికారి ఫిలిప్పో గోరీ మాట్లాడుతూ, భారత్‌లోకి వచ్చే క్లయింట్లతో చర్చలు జరపడానికి, డీల్స్ చేసుకోడానికి అమెరికా తరువాత ఇక్కడ కార్యకలాపాలను మరింత విస్తరించాలని చూస్తున్నట్లు తెలిపారు.

హెల్త్‌కేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలలో లావాదేవీలే కాకుండా, “ఇండియా ఫర్ ఇండియా”, “ఇండియా ఫర్ ది వరల్డ్” వంటి డీల్ మేకింగ్ కార్యకలాపాల ద్వారా భారత్‌కు వచ్చే క్లయింట్ల సంఖ్య పెరుగుతుంది, ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి అన్ని దేశాలతో వ్యాపార కనెక్టివిటీని పెంచుకోవడానికి విస్తరణ చాలా అవసరమని గోరీ చెప్పారు. ఒకప్పుడు అమెరికా తరువాత చైనా వ్యాపార పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉండగా, ఇటీవల కాలంలో ఆ ధోరణి పూర్తిగా మారిపోయింది. అక్కడి అంతర్జాతీయ సంస్థలు క్రమంగా భారత్‌కు తరలివస్తున్నాయి. దాంతో ఇతర దేశాల ప్రతినిధులు, పెట్టుబడిదారులు భారత్‌కు వస్తుండటంతో ఇండియాను ముఖ్యమైన వ్యాపార నిర్వహణ దేశంగా JP మోర్గాన్ భావిస్తున్నట్లు గోరీ పేర్కొన్నారు.

ఇప్పటికే చాలా కంపెనీలు చైనా నుంచి తమ కార్యకలాపాలను భారత్‌కు షిప్ట్ చేశాయి. ప్రస్తుతం ఈ తరలింపు తక్కువగా కనిపిస్తున్నప్పటికీ రానున్న 5, 10, 15 సంవత్సరాలలో ఇది మరింత ఎక్కువ అవుతుంది. ఎందుకంటే భారత్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోంది, ఇక్కడ ఉన్న సానుకూల అంశాల కారణంగా పెట్టుబడిదారులకు భారత్‌కు ఒక పెద్ద గమ్యస్థానంగా మారుతుందని గోరీ అన్నారు.

Advertisement

Next Story