భారత్‌లో కొత్త గ్లోబల్ రీసెర్చ్ కంపెనీ ఏర్పాటు చేయనున్న సుజుకి!

by Nagaya |
భారత్‌లో కొత్త గ్లోబల్ రీసెర్చ్ కంపెనీ ఏర్పాటు చేయనున్న సుజుకి!
X

గాంధీనగర్: ప్రముఖ సుజుకి మోటార్ కార్ప్ భారత్‌లో కొత్త గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీని ఏర్పాటు చేయనున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. అంతేకాకుండా భవిష్యత్తులో దేశీయంగా మరింత వేగవంతనమైన పెట్టుబడులను కొనసాగించనున్నట్టు కంపెనీ అధ్యక్షుడు తోషిహిరో సుజుకి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. భారత్‌లో సుజుకి కంపెనీ 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా హాజరయ్యారు.

సుజుకి పూర్తి యాజమాన్య పరిధిలో ఏర్పాటు కాబోయే ఈ కంపెనీ ద్వారా సంస్థ ఆర్అండ్‌డీ సామర్థ్యాలను భారత్‌కు మాత్రమే కాకుండా ప్రపంచ మార్కెట్లలో విస్తరించడానికి కూడా సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు. సుజుకి గ్రూప్ సంస్థకు భారత్ అత్యంత ముఖ్య మార్కెట్లలో ఒకటి. దేశంలో సుజుకి 40 ఏళ్ల అనుభవాన్ని కలిగి ఉంది. సంస్థ ఇప్పటివరకు భారత్‌లో రూ. 65 వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టింది. ఈ పెట్టుబడులతో మారుతీ సుజుకి ప్యాసింజర్ వాహన మార్కెట్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. సుజుకి గ్రూప్ గతేడాది ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేసిన 28 లక్షల వాహనాల్లో 60 శాతానికి పైగా భారత్‌లో తయారైనవేనని కంపెనీ అధ్యక్షుడు సుజుకి అన్నారు.

Advertisement

Next Story