గ్లోబల్ మార్కెట్లను వెంటాడుతున్న యుద్ధ భయాలు!

by Harish |   ( Updated:2023-10-14 08:12:23.0  )
గ్లోబల్ మార్కెట్లను వెంటాడుతున్న యుద్ధ భయాలు!
X

ముంబై: భారత స్టాక్‌మార్కెట్లతో పాటు, గ్లోబల్ మార్కెట్ల పెట్టుబడిదారులు ఇజ్రాయిల్-హమాస్ యుద్ధాన్ని నిషితంగా గమనిస్తున్నారు. ఉపధ్రవంలా యుద్ధం మొదలైన మొదటి రోజే గ్లోబల్ మార్కెట్లు, దేశీయ మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అయితే ఆ తర్వాత భారత మార్కెట్లు వేగంగానే కోలుకున్నాయి. ముఖ్యంగా భారత ఆర్థిక వ్యవస్థ పట్ల ప్రపంచ ఆర్థిక వేత్తలు ఆశాజనక రేటింగ్ అందించడం, భారత వృద్ధి అంచనాలను పెంచడం వంటి కారణాల వల్ల పెట్టుబడిదారులకు భారత్ ఒక గమ్యస్థానంగా ఏర్పడింది.

ఈ వారం ప్రారంభంలోనే నష్టాలతో మొదలైన భారత సూచీలు వారం చివరి రోజు కూడా నష్టాల్లోనే పయనించాయి. యుద్ధ భయాల నుంచి భారత్ వేగంగా బయటపడినప్పటికి గ్లోబల్ మార్కెట్లలో అస్థిరత కారణంగా దేశీయ మార్కెట్లు కూడా ఆశించినంతగా రాణించలేదు. వారం మధ్యలో కొన్ని పరిణామాలు మన మార్కెట్లకు కలిసొచ్చాయి. అయితే ఐటీ ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, బ్యాంకింగ్ ఫలితాలు వంటి కారణంగా దేశీయ మార్కెట్లు వారం చివర్లో ఒత్తిడికి లోనయ్యాయి.

గ్లోబల్ మార్కెట్లకు మాత్రం ఇంకా యుద్ధ భయాలు ఉన్నాయి. దీని ప్రభావం ఎలా ఉంటుందో అని పెట్టుబడి దారులు ఆచితూచి కొనుగోళ్లు జరుపుతున్నారు. వడ్డీ రేట్ల పెంపు లేకపోవడం, చమురు ఉత్పత్తి సంస్థలపై యుద్ధ ప్రభావం తక్కువగానే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తుండటంతో అమెరికా, ఏషియన్, యూరప్ మార్కెట్లు కొంత మేరకు పుంజుకునే అవకాశం ఉంది. అయితే ఈ యుద్ధం మరింత తీవ్రతరం అయితే అభివృద్ధి చెందిన దేశాలతో పాటు, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలకు తీవ్ర ప్రతికూలత అవుతుంది. దీంతో ప్రపంచ మార్కెట్లు రాణించకలేకపోవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story