ఈసారి బడ్జెట్‌లో ఫోకస్ చేయాల్సిన ఐదు ముఖ్యమైన అంశాలివే..

by S Gopi |
ఈసారి బడ్జెట్‌లో ఫోకస్ చేయాల్సిన ఐదు ముఖ్యమైన అంశాలివే..
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది మధ్యంతర బడ్జెట్ కావడంతో ఎలాంటి అద్భుతమైన ప్రకటనలు ఉండవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అయినప్పటికీ పెట్టుబడిదారులు, మార్కెట్ పరిశీలకులు కొన్ని పెద్ద ప్రకటనల కోసం ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 1న ప్రకటించబోయే బడ్జెట్ కేవలం ఓట్ ఆన్ అకౌంట్ మాత్రమే అవుతుంది. సార్వత్రిక ఎన్నికల కారణంగా ప్రభుత్వం ఖర్చులకు మాత్రమే బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇస్తుంది. ఏప్రిల్-మేలో ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తి బడ్జెట్ వెలువడుతుంది.

ఈ నేపథ్యంలో మధ్యంతర బడ్జెట్లో అధిక వెయిటేజీ కలిగిన ప్రధాన ఐదు అంశాలను విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. అవెంటో చూద్దాం..

ఉద్యోగాలు..

ఈ ఏడాది ఎన్నికలు ఉన్న తరుణంలో దేశంలో వేగంగా పెరుగుతున్న యువతకు తగిన స్థాయిలో ఉద్యోగావకాశాలు లేవని ప్రతిపక్షాలు మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ప్రతి ఏటా 10 లక్షల కంటే ఎక్కువ మంది యువత దేశీయ శ్రామిక శక్తిలో చేరుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వారికి సరైన అవకాశాలను కల్పించడం అత్యవసరం. లేదంటే భారత జనాభా తీవ్ర నిరాశకు గురికావచ్చు. ఈ లోటును తీర్చేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గ్రామీణ మౌలిక సదుపాయాల కోసం నిధులు పెంచి, సేవలు, రసాయనాల వంటి పరిశ్రమలకు పీఎల్ఐ పథకాన్ని విస్తరించే ప్రోత్సాహకాలను ప్రకటించవచ్చు.

ద్రవ్యలోటుపై దృష్టి..

ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు దూకుడుగా వ్యవహరిస్తుందా లేదా ద్రవ్యలోటును అదుపులో ఉంచుకునే చర్యలు చేపడుతుందా అనేది ముఖ్యమైన అంశం. ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో ద్రవ్యలోటును దేశ జీడీపీలో 5.3 శాతానికి తగ్గించే చర్యలు తీసుకోవచ్చు. ఎన్నికల ఒత్తిడి ఉన్నప్పటికీ కేంద్రం ఇందుకు ప్రయత్నిస్తుందని భావిస్తున్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు.

మూలధన వ్యయం..

గడిచిన నాలుగేళ్లలో దేశ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు మోడీ ప్రభుత్వం చాలా ఖర్చు చేసింది. ఈసారి కూడా ఈ ధోరణి కొనసాగనుంది. ముఖ్యంగా మౌలిక సదుపాయాల రంగం కోసం మధ్యంతర బడ్జెట్‌లో మూలధన వ్యయాన్ని పెంచే అవకాశాలున్నాయి.

వినియోగం..

పరిశోధనా సంస్థ రెడ్‌సీర్ నివేదిక ప్రకారం, భారత ప్రైవేట్ వినియోగం 2019 నుంచి వేగంగా పెరుగుతోంది. అవసరమైన వాటిపై మాత్రమే ఖర్చు చేసే ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. కానీ భారత వినియోగ మార్కెట్లో పట్టణ ప్రాంతం కంటే గ్రామీణం వెనుకబడి ఉంది. దీన్ని భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌లో తగిన చర్యలు తీసుకోవచ్చు. వ్యవసాయ ఆర్థికవ్యవస్థను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో వినియోగాన్ని పెంచే విధానాలను ఆర్థిక మంత్రి ప్రతిపాదించవచ్చు.

సంక్షేమానికి..

ఈసారి బడ్జెట్‌లోనూ కేంద్రం ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు నిధులు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానివల్ల అధిక పన్ను రాబడికి వెసులుబాటు ఉండటమే దీనికి కారణం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ, కార్పొరేట్ పన్ను వసూళ్లు భారీగా పెరిగాయి. మొత్తం ప్రత్యక్ష పన్నులు బడ్జెట్ అంచనా రూ. లక్షల కోట్లను మించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

Next Story