పైలట్ల ఇంక్రిమెంట్లను పునరుద్ధరించిన ఇండిగో!

by Vinod kumar |   ( Updated:2023-02-13 11:15:45.0  )
పైలట్ల ఇంక్రిమెంట్లను పునరుద్ధరించిన ఇండిగో!
X

న్యూఢిల్లీ: దేశీయ విమానయాన పరిశ్రమ కరోనా మహమ్మారి పరిస్థితుల నుంచి బయటపడుతోంది. విమాన ప్రయాణీకుల రద్దీ కూడా గాడిన పడుతున్న నేపథ్యంలో విమానయాన సంస్థల ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగు పడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో తాజా తన పైలట్ల ఇంక్రిమెంట్ల ను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది.

సంస్థలోని 4,500 కంటే ఎక్కువమంది పైలట్లకు వార్షిక వేతనాల్లో పెంపును పునరుద్ధరిస్తామని ఉద్యోగులకు పంపిన మెయిల్‌లో స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుంది. కొవిడ్ సమయంలో విమానయాన సంస్థలన్నీ పూర్తిగా డీలా పడ్డాయి. ఆర్థిక నష్టాలను భరించేందుకు ఉద్యోగులకు చెల్లించే ప్రోత్సాహకాలను రద్దు చేయడంతో పాటు జీతాలను కూడా తగ్గించాయి.

ఇటీవల విమానయాన కార్యకలాపాలు కరోనాకు ముందు స్థాయికి చేరుకోవడంతో కంపెనీలు పాత విధానంలో జీతాలను, ఇంక్రిమెంట్ల ను ఇస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి ఇండిగో లాభాలు సైతం రూ. 1,422 కోట్లను ప్రకటించగా, ఆదాయం 60 శాతం వృద్ధితో రూ. 14,933 కోట్లుగా వెల్లడించింది. వరుస మూడు త్రైమాసికాల తర్వాత కంపెనీ లాభాల్లోకి మారడంతో పైలట్ల వేతనాలను సవరించింది.

Advertisement

Next Story