సరికొత్త గరిష్ఠాలకు చేరిన సూచీలు!

by Vinod kumar |
సరికొత్త గరిష్ఠాలకు చేరిన సూచీలు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి చారిత్రాత్మక గరిష్ఠాలను తాకాయి. గురువారం ట్రేడింగ్‌లో సూచీలు రోజంతా ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ కీలక సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త గరిష్ఠాలను చేరాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు, దేశీయంగా వరుస సెషన్లలో ర్యాలీ కారణంగా లాభాల స్వీకరణ ఒత్తిడి ఉన్నప్పటికీ మదుపర్ల ఆఖరి గంటలో కొంత మద్దతివ్వడంతో సానుకూలంగా ట్రేడింగ్‌ని ముగించాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 67,771, నిఫ్టీ 20,167 ఆల్‌టైమ్ హైని తాకాయి. సెన్సెక్స్ వరుసగా 10వ సెషన్‌లో లాభాలను కొనసాగించడం విశేషం.

ఎఫ్అండ్ఓ వీక్లీ ఎక్స్‌పైరీ కారణంగా ఎక్కువ లాభాలకు ఆస్కారం లేకుండా పోయిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఆటో, ఐటీ రంగాల్లో కొనుగోళ్లతో మార్కెట్లకు కలిసొచ్చింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 52.01 పాయింట్లు లాభపడి 67,519 వద్ద, నిఫ్టీ 33.10 పాయింట్లు పెరిగి 20,103 వద్ద ముగిశాయి. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ, మెటల్ రంగాలు రాణించాయి.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎంఅండ్ఎం, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, నెస్లె ఇండియా, పవర్‌గ్రిడ్, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. ఏషియన్ పెయింట్, ఐటీసీ, సన్‌ఫార్మా, టాటా మోటోర్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.99 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed