ఈ ఏడాది 10 శాతం పెరగనున్న ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు!

by Harish |
ఈ ఏడాది 10 శాతం పెరగనున్న ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు!
X

న్యూఢిల్లీ: రాబోయే ఆర్థిక సంవత్సరంలో భారత ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 9-10 శాతం పెరుగుతాయని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద వాహన మార్కెట్ అయిన భారత్‌లో గిరాకీ మెరుగ్గా ఉండటం, గత రెండేళ్ల నుంచి ఒత్తిడి పెంచిన చిప్‌ల కొరత ప్రభావం తగ్గడం వంటి కారణాలతో పరిశ్రమలో విక్రయాలు ఊపందుకోనున్నాయని క్రిసిల్ తన నివేదికలో వెల్లడించింది.

మరోవైపు వాహనాల ఎగుమతులు నెమ్మదించినప్పటికీ, 2023-24లో వాహనాల అమ్మకాలు 50 లక్షల యూనిట్లతో రికార్డు స్థాయికి చేరుకుంటాయని క్రిసిల్ నివేదిక అంచనా వేసింది. ముఖ్యంగా అధిక రాబడి, కీలకమైన ఎస్‌యూవీల గిరాకీ మద్దతుతో దేశీయ వాహన పరిశ్రమ వృద్ధికి దోహదపడనున్నాయి. 2018 సమయంలో మొత్తం దేశీయ వాహనాల అమ్మకాల్లో ఎస్‌యూవీల వాటా 28 శాతం ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ఇది దాదాపు రెట్టింపు వృద్ధితో 55 శాతానికి చేరుకునే అవకాశాలున్నాయి.

కాంపాక్ట్ ఎస్‌యూవీలతో పాటు ఎస్‌యూవీలపై ఒరిజినల్ పరికరాల తయారీదారులు దృష్టి సారించడంతో పరిశ్రమ వృద్ధికి కీలక మద్దతు లభిస్తోంది. భౌగోళిక రాజకీయ పరిణామాలు, ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వడ్డీ రేట్లు వంటి కారణాలతో సెడాన్, ఎంట్రీ లెవల్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు మందగించినప్పటికీ పరిశ్రమ వృద్ధికి ఢోకా ఉండదని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ అనూజ్ సేథి అన్నారు.

ఉక్కు, అల్యూమినియం, రబ్బరు వంటి కీలక ముడి పదార్థాల ధరలు గత ఏడాది ప్రథమార్థం వరకు గరిష్ట స్థాయికి చేరాయి. ఆ తర్వాత నుంచి ధరలు క్రమంగా దిగు వస్తున్నాయి. ఈ క్రమంలో పరిశ్రమ వృద్ధికి అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. మరోవైపు ఈవీల విభాగంలో చార్జింగ్ మౌలిక సదుపాయాలు నెమ్మదిగానే ఉండటంతో ఇంధన వాహనాలపై ఎలక్ట్రిక్ వాహనాల ప్రభావం ఇప్పట్లో ఉండకపోవచ్చని ఆయన పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం దేశంలోని మొత్తం వాహనాల అమ్మకాల్లో ఈవీల వాటా 1 శాతం మాత్రమే ఉంది.

Advertisement

Next Story

Most Viewed