ఆగష్టు జీఎస్టీ వసూళ్లు రూ. 1.59 లక్షల కోట్లు!

by Vinod kumar |
ఆగష్టు జీఎస్టీ వసూళ్లు రూ. 1.59 లక్షల కోట్లు!
X

న్యూఢిల్లీ: భారత వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) ఆదాయం ప్రతి నెలా భారీ స్థాయిలో నమోదవుతోంది. దేశంలోని చిన్న వ్యాపారులను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం, కొత్త వ్యాపారాలు పుంజుకోవడం ఇందుకు దోహదపడుతున్నాయి. తాజాగా, ఆగష్టు నెలకు సంబంధించి జీఎస్టీ వసూళ్లు రూ. 1.59 లక్షల కోట్లకు పెరిగాయని, ఇది ఏడాది ప్రాతిపదికన 11 శాతం వృద్ధి అని ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటనలో వెల్లడించింది.

అంతకుముందు జూలై నెలలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో రూ. 1.65 లక్షల కోట్లకు చేరిన సంగతి తెలిసిందే. 2022, ఆగష్టులో జీఎస్టీ ఆదాయం రూ. 1,43,612 కోట్లుగా నమోదైంది. జీఎస్టీ అమలైన తర్వాత ఇప్పటివరకు ఈ ఏడాది ఏప్రిల్‌లో వచ్చిన రూ. 1.87 లక్షల కోట్లే అత్యధిక ఆదాయంగా ఉన్నాయి.

అంతర్జాతీయంగా ఇతర ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్ మెరుగ్గా ఉందనేందుకు ఈ వసూళ్లు సంకేతాలిస్తున్నాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇదే సమ్యంలో దేశవ్యాప్తంగా పండుగ సీజన్ మొదలవడం, ఇళ్ల నిర్మాణాలకు, కార్లు, విహారయాత్రలు, ఇతర వినియోగ ఉత్పత్తుల కోసం ప్రజలు ఖర్చు చేయడం వంటి అంశాలు జీఎస్టీ వసూళ్ల పెరుగుదలకు కారణమని తెలిపారు.

మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, సమీక్షించిన నెలలో మొత్తం రూ. 1,59,069 కోట్ల జీఎస్టీ ఆదాయం నమోదైంది. అందులో సీజీఎస్టీ రూ. 28,328 కోట్లు, ఎస్‌జీఎస్టీ రూ. 35,794 కోట్లు, ఐజీఎస్టీ రూ. 83,251 కోట్లు(వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ. 43,550 కోట్లతో కలిపి), సెస్ రూ. 11,695 కోట్లు(వస్తువుల దిగుమతులపై వసూలైన రూ. 1,016 కోట్లతో కలిపి) వసూలయ్యాయి.

తెలుగు రాష్ట్రాల్లో..

వస్తు, సేవల పన్ను ఆదాయంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఈసారి గణనీయమైన వృద్ధిని సాధించాయి. తెలంగాణలో ఆగష్టు జీఎస్టీ వసూళ్లు రూ. 4,393 కోట్లతో 13 శాతం పెరిగాయి. గతేడాది ఇదే నెలలో తెలంగాణ జీఎస్టీ ఆదాయం రూ. 3,871 కోట్లుగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో గత నెల రూ. 3,479 కోట్లు రాగా, ఇది గతేడాది మేలో వచ్చిన రూ. 3,173 కోట్ల కంటే 10 శాతం ఎక్కువని మంత్రిత్వ శాఖ వివరించింది.

Advertisement

Next Story

Most Viewed